మమ్మల్ని కొంత కాలం పని చేయనివ్వండి
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:31 AM
‘‘ప్రతి విషయంలో రాద్ధాంతం వద్దు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. మమ్మల్ని కొంత కాలం పనిచేయనివ్వండి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు.
మీ కడుపులో విషాన్నంతా మా మీద, ప్రజల మీద కక్కకండి
చివరి 6 నెలలూ ఎలాంటి రాజకీయాలకైనా సిద్ధమే.. లేదంటే ఈ 30 నెలల ప్రగతిపై చర్చకు రావాలి
కాలుష్యకారక పరిశ్రమలన్నీ ఓఆర్‌ఆర్ బయటకు.. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో నెక్ట్స్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ ప్రారంభం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/షాబాద్)
‘‘ప్రతి విషయంలో రాద్ధాంతం వద్దు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. మమ్మల్ని కొంత కాలం పనిచేయనివ్వండి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ పారిశ్రామిక వాడలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నిర్మించిన నెక్ట్స్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను గురువారం ప్రారంభించిన సీఎం.. అల్యూమినియం ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి, ప్రతిపక్షాల తీరుపై విమర్శలు చేశారు. ‘‘ప్రతి రోజూ మీలో బాధ, దుఃఖంతో పాటు అధికారం కోల్పోయిన అసహనం కన్పిస్తోంది. మీ కడుపులో ఉన్న విషాన్నంతా ప్రభుత్వం, ప్రజల మీద కక్కకండి’’ అని విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు తమకు 5 ఏళ్లపాటు అఽధికారాన్నిస్తూ ఇచ్చారని గుర్తుచేసిన సీఎం.. చివరి ఆరు నెలలూ ఏ రాజకీయాలకైనా తాము సిద్ధమేనన్నారు. ‘‘ఈ రోజు మేము చేసిందేమిటి? ఆ రోజు మీరు చేసిందేమిటి? అనేదానిపై చర్చిద్దాం. కాదూ కూడదంటే.. గడిచిన 30 నెలల్లో విద్య, ఆరోగ్యం, ఆర్ధిక రంగాలకు సంబంధించి తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికల మీద చర్చిద్దాం రండి’’ అని విపక్షాలకు సవాల్ విసిరారు. 2024లో విద్యారంగంలో దేశంలో 36 స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 18వ ర్యాంకులోకి వచ్చిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని విద్యతోపాటు.. ఆరోగ్యం, ఆర్ధిక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఉత్తమ నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజధానిని కాలుష్యరహితంగా మార్చడం కోసం.. త్వరలోనే నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలనన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించనున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్-రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ అవతల అగ్రి ఎకానమీని డెవలప్ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మూసీ నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.
ఉదారంగా వ్యవహరించండి
సీతారాంపూర్‌లో పరిశ్రమ ఏర్పాటుతో భూములు కోల్పోయిన కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సీఎం ఆదేశించారు. అర్హులకు ఇంటి పట్టాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార సముదాయాల ఏర్పా టు వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే.. వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తున్న నేపథ్యంలో.. భూములు కోల్పోయిన రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించి, సాధ్యమైనంత వరకూ వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే యాదయ్య చేసిన విజ్ఞప్తి పట్ల సీఎం స్పందించారు. యాదయ్య కోరికలు తీర్చడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సరదాగా అన్న ఆయన.. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు. బుద్వేల్ నుంచి కొడంగల్ వరకూ 100 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సీతారాంపూర్‌లో నిర్మిస్తున్న ఆలయ ప్రారంభోత్సవానికి త్వరలో మరోసారి వస్తానని సీఎం హామీ ఇచ్చారు.
అన్ని రంగాల్లో అగ్రగామిగా: శ్రీధర్‌బాబు
సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. జహీరాబాద్‌లో జాతీయ పారిశ్రామిక తయా రీ మండలి ఏర్పాటు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ ఇంధ న రంగాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ‘మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ఇక్కడి నుంచే ప్రపంచానికి ఉత్పత్తులను అందించాలి. ఇదే మా ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’ అని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను దశలవారీగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సీతారాంపూర్‌లో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. తాము ఏర్పాటు చేసిన ఈ సోలార్ మాడ్యూల్ యూనిట్ సామర్థ్యం 5.6 గిగావాట్లని ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ తెలిపారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో సెకన్‌కు రెండు మాడ్యూల్స్ తయారవుతాయని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో తాము 12 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు యాదయ్య, మనోహర్ రెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా సోలార్ ఆక్సీట్రీ
ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రంలో.. కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని, ఆక్సిజన్‌ను విడుదల చేసే సోలార్ ఆక్సీట్రీని ఏర్పాటు చేసింది. దాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. వాయుకాలుష్య నియంత్రణకు.. సోలార్ ఎనర్జీతో ఆక్సిజన్ పం పింగ్ చేసే యంత్రాలను ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించడం అభినందనీయయన్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడంపై అందరూ ఆలోచన చేయాలని ఆవేదన వెలిబుచ్చారు. పూర్తిగా సౌరశక్తితో పూర్తి గా పనిచేసే ఈ ఆక్సీట్రీలో సూక్ష్మశైవల (మైక్రో ఆల్గే) సాంకేతికతను వాడమని సంస్థ చైర్మన్ సురేందర్‌పాల్‌సింగ్ తెలిపారు. తమ వంతుగా సర్కారుకు 200 సోలార్ ఆక్సీట్రీలను అందజేస్తామన్నారు.