కార్యక్షేత్రంలోకి సీఎం
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:48 AM
పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత.. అభివృద్ధి కార్యక్రమాల అమలు, అత్యవసర పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు.
నేటి నుంచి 99 రోజుల యాక్షన్ ప్లాన్ షురూ
5-12 దాకా రాష్ట్ర పర్యటన
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత.. అభివృద్ధి కార్యక్రమాల అమలు, అత్యవసర పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. మొదటగా హైదరాబాద్ పరిధిలో ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి జూన్ వరకు ‘99 రోజుల యాక్షన్ ప్లాన్’ను రూపొందించింది. ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్వచ్ఛత, శుభ్రత సహా అభివృద్ధి కార్యక్రమాలు, అత్యవసర పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.
ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాక్షన్ ప్లాన్‌లో సీఎం సహా ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కానున్నారు. యాక్షన్ ప్లాన్ పనులు ప్రారంభమైన తర్వాత 5 నుంచి 12 వరకు సీఎం రేవంత్ కోర్ అర్బన్ పరిధిలో రోజుకొక విభాగం పరిధిలోని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాలను సీఎం పరిశీలించనున్నారు. అలాగే నగరం పరిధిలో అత్యధిక చెత్త వేస్తున్న ప్రాంతాల గురించి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షల్లో సీఎం రేవంత్ ప్రస్తావించారు. అలాంటి ప్రాంతాల్లో చెత్త వేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, స్థానికులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆ ఫాగింగ్ పనిచేస్తోందా..?
‘‘దోమల నివారణకు మీరు చేస్తున్న ఫాగింగ్ అసలు పనిచేస్తుందా. అది చేశాకే దోమలు ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తోంది. ఏం ఫాగింగ్ చేస్తున్నారో ఏంటో’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులతో అన్నారు. స్పందించిన అఽధికారులు.. ప్రస్తుతం ఫాగింగ్ కోసం వినియోగిస్తున్న రసాయనంలో కొంత మార్పు చేయాలని అన్నట్టు సమాచారం. కొత్త రకం రసాయనాన్ని వినియోగిస్తే దోమల నివారణ, పునరుత్పత్తిని ఆపే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పగా.. దానిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్టు తెలిసింది.
కార్పొరేషన్ భవనాల కోసం స్థలాల గుర్తింపు
జీహెచ్‌ఎంసీని విభజించిన అనంతరం కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల భవనాల కోసం ప్రభుత్వం కసతర్తు చేస్తోంది. ఆయా భవనాలకు అవసరమైన స్థలాన్ని అధికారులు గుర్తించారు. కార్పొరేషన్ పరిధిలో రెండు, మూడు చోట్ల స్థలాన్ని గుర్తించగా, ఆ వివరాలను సీఎంకు వివరించారు. ఎక్కడ భవనాలను నిర్మించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో మరో 3-4 కొత్త ఎలివేటేడ్ కారిడార్లు..
హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, కొన్ని చోట్ల పనులకు శంకుస్థాపన చేసింది. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ-లక్డీకాపూల్-ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఒకటి, పీర్జాదీగూడ, బంజారాహిల్స్ ప్రాంతంలో ఒకటి చొప్పున దాదాపు మరో 3-4 కొత్త ఎలివేటెడ్ కారిడార్లకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమీక్షలో కొత్త ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన ప్రాథమిక అలైన్‌మెంట్, డిజైన్లను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. అయితే వాటిపై రేవంత్ మరికొన్ని సూచనలు చేశారు. వాటి ప్రకారం డిజైన్లు రూపొందించి మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని తెలిసింది.