ఇళ్లు కట్టించి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:54 AM
రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చే హామీలు ఎన్నికలకే పరిమితం కాదని నిరూపించే ఘటన ఇది. సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మూడేళ్ల క్రితం ఓ...
వర్షాల వల్ల ఇంటిని కోల్పోయిన మహిళలకు.. అధికారం చేపట్టాక ఇళ్లు కట్టి ఇస్తానని హామీ
మూడేళ్ల క్రితం పాదయాత్రలో మాట.. నేడు గృహప్రవేశం
కామారెడ్డి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చే హామీలు ఎన్నికలకే పరిమితం కాదని నిరూపించే ఘటన ఇది. సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మూడేళ్ల క్రితం ఓ మహిళకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2023 మార్చిలో అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి చేరుకున్నారు. ఆ సమయంలో భిక్కనూర్ లక్ష్మీ, రాజమణి అనే మహిళలు ఆయన్ను కలిశారు. భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యామని చెప్పుకొన్నారు. వారి ఆవేదన విన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మీకు ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో సీఎం రేవంత్ తీరక లేకుండా ఉన్నప్పటికీ.. చిన్న మల్లారెడ్డి గ్రామంలో మహిళలకు ఇచ్చిన మాటను రేవంత్‌రెడ్డి మర్చిపోలేదు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ తీసుకుని లక్ష్మీ, రాజమణికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారు. శరవేగంగా నిర్మాణం పూర్తయ్యేలా చూశారు. దీంతో ఆ మహిళలు శనివారం తమ నూతన గృహంలో అడుగుపెట్టబోతున్నారు.