ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:05 AM
ప్యూచర్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు...
పనులు పరిగెత్తించాలని ముఖ్యమంత్రి ఆదేశం
కందుకూరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ప్యూచర్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ప్యూచర్ సిటీలో పర్యటించారు. స్కిల్ యూనివర్శిటీ భవనా నిర్మాణ పనులతో పాటు ప్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ ఆథార్టీ భవన సముదాయ పనులను గంటకుపైగా పరిశీలించారు. కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం నేరుగా ప్యూచర్ సిటీకి వచ్చారు. వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీజీఐఐసీ, ప్యూచర్ సిటీ ఎండీ శశాంక్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుతో కలిసి ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. రావిర్యాల ఓఆర్‌ఆర్ జంక్షన్ నుంచి ప్యూచర్ సిటీ మీదుగా రీజినల్ రింగురోడ్డు వరకు నిర్మిస్తున్న 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులపై ఆరా తీశారు. పనులు ఎంత వరకు వచ్చాయి? భూసేకరణ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. స్కిల్ యూనివర్శిటీ పనుల్లో వేగం పెంచాలన్నారు. వివిధ పనులకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్ సీఎండీ క్రిష్ణభాస్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.