Share News

అందెశ్రీ నాకు ఆత్మబంధువు

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:43 AM

ప్రముఖ కవిగా, గాయకుడిగా తెలంగాణ సమాజానికి సుపరిచితులైన అందెశ్రీ తనకు ఆత్మ బంధువని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తాను నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు తిరిగి ధైర్యాన్నిచ్చేవి అందెశ్రీ గీతాలని చెప్పారు.

అందెశ్రీ నాకు ఆత్మబంధువు

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కవిగా, గాయకుడిగా తెలంగాణ సమాజానికి సుపరిచితులైన అందెశ్రీ తనకు ఆత్మ బంధువని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తాను నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు తిరిగి ధైర్యాన్నిచ్చేవి అందెశ్రీ గీతాలని చెప్పారు. ‘‘ఇటుకపై ఇటుక పేర్చిన తాపీ మేస్త్రీ అందెశ్రీ.. అక్షరాలపై అక్షరాలని పేర్చి ఉద్యమ గీతాలు రాశారు. దొరల గడీల ముందు మోకరిల్లనని ధైర్యంగా చెప్పారు. ఆయన పాటలు తూటలై, మర ఫిరంగులై గడీలను బద్దలు కొట్టాయి. ఆయన పాట మన గుండెల్లో చైతన్యం నింపింది. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. కానీ, పదేళ్లలో కుట్రలు చేసి ఆయన పాటను వినిపించకుండా చేశారు. పెన్నుపై మన్ను కప్పితే గున్నులై మొలకెత్తుతాయని అన్నట్లుగా ఇప్పుడు ప్రతి బడిలో, ప్రతి గడపలో ఆయన పాట వినిపిస్తోంది’’ అని వివరించారు. ఆత్మ గౌరవంతో ఆయన ఏనాడు దొరల గడప తొక్కలేదని, తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప గడీలలో దొరల కోసం కాదని నిటారుగా నిలబడ్డారని కొనియాడారు. మనమంతా దండు కట్టి విష సర్పాలను తుద ముట్టించాలని అన్న ఆయన మాటలు తనకు ఇంకా గుర్తొస్తున్నాయన్నారు. తన కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించానన్నారు. ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో, గద్దరన్నను అవమానించారో ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడడానికి అందెశ్రీనే తనకు స్ఫూర్తి అని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 05:44 AM