ఇది రైతు నామ సంవత్సరం
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:09 AM
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...
రైతు సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
రైతు బాగుంటేనే సుఖశాంతులతో రాష్ట్రం
ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం రైతు నామ సంవత్సరమని వ్యాఖ్యానించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో గురువారం భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు పెద్ద పండుగ ఉగాది అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని, పంటకు బోనస్ కూడా అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటించడం గర్వకారణమని పేర్కొన్నారు. రైతు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో విరజిల్లుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే 25,35,000 మంది రైతు కుటుంబాలకు రూ.20,616కోట్ల మేర రుణమాఫీ చేశామని తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా పథకానికి రూ.18వేల కోట్లు ఖర్చు చేశామని, 22 న మరోసారి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.