గోమాతాస్త్రం!
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:05 AM
బీజేపీ హిందూత్వ ఎజెండాకు ‘ఆధ్యాత్మిక’ బాణంతో చెక్ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హిందూత్వ ఎజెండా ప్రధాన అంశం కాకుండా ఉండేలా...
బీజేపీ హిందూత్వ అజెండాకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కారు అడుగులు
యాదాద్రి, వేములవాడ, మొయినాబాద్‌లలో రూ.360 కోట్లతో అధునాతన గోశాలలు
వాటి ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని భావిస్తున్న సర్కారు
ప్రతిష్ఠాత్మకంగా ఆలయాల పునరుద్ధరణ, గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు
సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయట్లేదంటూ ప్రజల్లోకి సంకేతాలు
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ హిందూత్వ ఎజెండాకు ‘ఆధ్యాత్మిక’ బాణంతో చెక్ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హిందూత్వ ఎజెండా ప్రధాన అంశం కాకుండా ఉండేలా వ్యూహం పన్నుతున్నారా? అందులో భాగంగానే అధునాతన గోశాలల నిర్మాణం, ప్రధాన ఆలయాల పునరుద్ధరణ, ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు వంటివి చేపడుతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. కేవలం రెండు లోక్‌సభ సీట్ల నుంచి ఢిల్లీ పీఠంపై పాగా వేసేదాకా బీజేపీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించినది హిందూత్వ నినాదమేనని రాజకీయ విశ్లేకులు చెబుతుంటారు. అలా ఉత్తరాదిన మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపై, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ దిశగా దూకుడుగా వెళుతోంది. ఈ క్రమంలో బీజేపీని నిలువరించేందుకు రేవంత్ సర్కారు వ్యూహాత్మక చర్యలు చేపడుతోందని.. ఆ పార్టీకి ఆత్మ వంటి హిందూత్వ అంశం వచ్చే ఎన్నికల్లో కీలక ఎజెండాగా మారకుండా జాగ్రత్తపడుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ప్రధాన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టారని అంటున్నాయి. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, బాసర, వేములవాడ తదితర 20 ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేస్తున్నాయి. యాదాద్రిలో వేద పాఠశాల ఏర్పాటు, గోదావరి పుష్కరాల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమూ ఆ కోవలోకే వస్తుందని అంటున్నాయి. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని, హిందూత్వను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయట్లేదన్న సంకేతాన్ని సీఎం రేవంత్ ప్రజల్లోకి పంపిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
గోసంరక్షణ అంశంపైనా దృష్టి..
బీజేపీ నినాదాల్లో కీలకమైన గోసంరక్షణ అంశంపైనా సీఎం రేవంత్ దృష్టిసారించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యాదాద్రి, వేములవాడ, మొయినాబాద్‌లోని యెనికెపల్లిలో అధునాతన గోశాలల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు. యెనికెపల్లిలో 90 ఎకరాల విస్తీర్ణంలో రూ.160 కోట్లతో గోశాల నిర్మాణం జరుగుతుండగా.. వేములవాడలో 63 ఎకరాల్లో, యాదాద్రిలో వంద ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోటీ రూ.100 కోట్ల చొప్పున వ్యయంతో అధునాతనంగా వీటిని నిర్మిస్తున్నారు. యెనికెపల్లిలోని గోశాల జనవరిలో, వేములవాడ, యాదాద్రి గోశాలలు మే, జూన్ నాటికి నిర్వహణలోకి వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాటిని ప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇది తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు గోసంరక్షణ అంశంలో రాజీ పడట్లేదన్న సంకేతాన్ని ప్రధాని ద్వారా ఇప్పించే వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక హిందూయేతర పండుగల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా గోవధ జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇటీవల బక్రీద్ సందర్భంగా గోవులు హైదరాబాద్‌కు తరలించకుండా అరికట్టగలిగామని అంటున్నారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ముస్లిం వర్గాలు సహా దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలతో సానుకూలత వస్తోందని చెబుతున్నారు.