విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:30 AM
సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 17న విదేశీ యాత్రకు బయలుదేరనున్న ఆయన.. తిరిగి సెప్టెంబరు 10న రాష్ట్రానికి చేరుకోనున్నారు.
17 నుంచి వచ్చే నెల 10 దాకా షెడ్యూల్
అమెరికా, లండన్, జర్మనీ, చైనాలో పర్యటన
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 17న విదేశీ యాత్రకు బయలుదేరనున్న ఆయన.. తిరిగి సెప్టెంబరు 10న రాష్ట్రానికి చేరుకోనున్నారు. అమెరికా, లండన్, జర్మనీ, చైనా దేశాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావుతోపాటు అతి కొద్ది మందితో కూడిన బృందమే వెళ్లనుంది. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం పర్యటనలో ఈ సారి పెట్టుబడులతోపాటు ప్రముఖ విదేశీ వర్సిటీల ఆఫ్‌లైన్ క్యాంప్‌సలను తెలంగాణలో ఏర్పాటు చేయడం, లాంగ్, షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి జర్మనీ, చైనా దేశాలకు చెందిన పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా దేశాల్లోని కంపెనీల ప్రతినిధుల అపాయింట్‌మెంట్లు దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వివరించి.. తెలంగాణలో పెట్టుబడులు పెటేందుకు ముందుకురావాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే, డిసెంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2026కు రావాలని ఆయా దేశాల కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించనున్నారని సమాచారం. ఆయా దేశాల్లోని స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ విధానాలను అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది. మరోవైపు, ఆఫ్‌లైన్ క్యాంప్‌సల ఏర్పాటు, లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్‌ను అందించే విషయమై.. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీఎస్ వర్సిటీల ముఖ్యులతో సీఎం రేవంత్ భేటీ అవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కొన్ని వర్సిటీలతో ఎంవోయూలు చేసుకునే అవకాశం ఉందని, అందుకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 10వ తేదీ వరకు విదేశీ పర్యటన సాగాల్సి ఉన్నప్పటికీ.. అంతకంటే ముందే సీఎం బృందం తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.