Share News

సజావుగా పెట్రోల్‌ సరఫరా

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:52 AM

రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగుతోందని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించి పరిస్థితులను....

సజావుగా పెట్రోల్‌ సరఫరా

  • బ్లాక్‌ మార్కెట్‌ నిరోధానికి కమిటీలు, నోడల్‌ అధికారులు

  • ప్రాధాన్యక్రమంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా

  • ప్రధాని మోదీకి తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగుతోందని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోందని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ గ్యాస్‌ సరఫరా, పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల బ్లాక్‌ మార్కెట్‌ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి, నోడల్‌ అధికారులను నియమించామని చెప్పారు. ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యక్రమంలో కమర్షియల్‌ సిలిండర్లను పంపుతున్నామన్నారు. ప్రతి బంక్‌లో స్టాక్‌ వినియోగంపై అధికారులు పర్యవే క్షిస్తున్నారని తెలిపారు. ‘‘తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలో లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం జరుగుతుంది. ప్రస్తుతం 1,88,210 కిలో లీటర్ల నిల్వలు ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కొరతపై సోషల్‌ మీడియాలో అపోహలు, భయాందోళనలు కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించి ఎలక్ర్టిక్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయించామన్నారు. హైదరాబాద్‌లోని 1.20 లక్షలకుపైగా పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను రిట్రో ఫిట్టింగ్‌ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో ఇక ముందు అన్నీ ఈవీ బస్సులనే వినియోగించనున్నామన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 05:52 AM