CM Revanth Reddy Emphasizes Public Health: నేనొక సామాజిక వైద్యుడిని..
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:45 AM
నేను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వైద్యుడిని కాదు.. కానీ సమాజాన్ని తీర్చిదిద్దే సామాజిక వైద్యుడిని’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు...
వైద్య, అనుబంధ రంగాల్లో వేగంగా హైదరాబాద్ అభివృద్ధి.. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం
నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం
సమాజం పట్ల బాధ్యతను వైద్యులు మర్చిపోకూడదు
గుండె జబ్బుల నివారణలో భాగస్వాములవుదాం
ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ‘నేను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వైద్యుడిని కాదు.. కానీ సమాజాన్ని తీర్చిదిద్దే సామాజిక వైద్యుడిని’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజారోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను మెరుగుపర్చుకోవడానికి వైద్యులతో కలిసి పనిచేస్తామని, ఆ దిశగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్, ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’లో సీఎం మాట్లాడారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన 500 మందికిపైగా కార్డియాలజిస్టులు హాజరైన ఈ సదస్సు హైదరాబాద్‌లో జరగడం గర్వకారణమని, తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ‘మీరంతా విజయం సాధించిన డాక్టర్లు. అయినా పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ సదస్సుకు వచ్చారని అభినందించారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని పేర్కొన్నారు. వైద్యులను సమాజంలో ఒక ప్రత్యేక సమూహంగా పేర్కొంటూ వారిని ప్రాణాలు కాపాడేవారిగా తామంతా బలంగా నమ్ముతామని చెప్పారు. సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మర్చిపోవద్దని డాక్టర్లకు సూచించారు. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలావేగంగా మారుస్తున్నాయని, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ ముడిపడి ఉందన్నారు. ‘అందుకే అత్యాధునిక పరిజ్ఞానం విషయంలో మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మాత్రం మర్చిపోవద్ద’ని డాక్టర్లకు సూచించారు. ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలామంది చనిపోతున్నారని, దీన్ని నివారించే మిషన్‌లో మనమంతా భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సీపీఆర్ ఎలా చేయాలో విద్యార్థులకు నేర్పించడానికి డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకొస్తే మన దేశంలో చాలామంది ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని డాక్టర్లను కోరారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే బెస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు.