Share News

గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:36 AM

రాష్ట్రంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే సమయం అయిపోయుందని, ఇక భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి సారిద్దామని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష.....

గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది

  • భవిష్యత్‌ ప్రణాళికలపైనే దృష్టి సారిద్దాం

  • ఇప్పుడు వేసే రోడ్‌ మ్యాపే ఎన్నికల్లో అజెండా

  • సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

  • సభకు రాకపోతే ఎమ్మెల్యే అవడం ఎందుకు?

  • కష్టపడి సాధించుకున్న పదవికి న్యాయం చేయాలి

  • సభకు వచ్చి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి

  • సీఎల్పీ సమావేశానికీ రానంత బిజీగా ఉన్నారా?

  • మీడియాతో ఎవరూ చిట్‌చాట్‌లు చేయొద్దు

  • రాజకీయాల్లో వ్యక్తిగత నష్టం ఉండదు.. అది వ్యవస్థ మొత్తానికీ నష్టం చేస్తుంది

  • అందరూ పార్టీ లైన్‌లోనే మాట్లాడాలి

  • నేతల లెక్కలు పార్టీ రాసుకుంటోంది.. జాగ్రత్త

  • సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌ హితబోధ

  • నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే సమయం అయిపోయుందని, ఇక భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి సారిద్దామని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు వేసుకునే ప్రణాళికే వచ్చే ఎన్నికల్లో అజెండా కానుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు శాసనసభకు సరిగా హాజరవకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావడానికి పార్టీ కార్యకర్త మొదలుకొని నాయకులు, ప్రజల వరకు ఎంతో మంది కష్టపడతారు. అలాంటి ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయాలి.


కానీ, కొందరు ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కావట్లేదు. కొంత మంది వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. సభలో కూర్చోకపోతే ఇంక ఎమ్మెల్యే అవడం ఎందుకు?’’ అంటూ రేవంత్‌రెడ్డి సభ్యులకు హితబోధ చేశారు. అందరూ సభకు హాజరై ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. అధికారం పోతే తన ఒక్కడికే కాదని, అందరికీ పోతుందని గుర్తుచేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్దేశించుకునేందుకుగాను కమిటీ హాల్లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు ఎమ్మెల్యేలు సరిగా హాజరు కాకపోవడం, ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా స్పందించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సీఎల్పీ సమావేశానికీ కొందరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కీలక భేటీకీ రానంత బిజీగా ఉన్నారా?’ అని సీఎం ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో నిర్లక్ష్యం తగదని, అందరూ హాజరై చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షం ఈ సమావేశాల కోసం భారీగా కసరత్తు చేసినట్లు కనిపిస్తోందని, శిక్షణా తరగతులూ నిర్వహించుకుందని గుర్తుచేశారు. వారు లేవనెత్తే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పేందుకు ఎమ్మెల్యేలు సన్నద్ధం కావాలన్నారు. ఎవరికి ఏ అంశంపై అవగాహన ఉందో.. దానిపైనే చర్చలో పాల్గొనాలన్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే విప్‌లు.. మరింత చురుగ్గా ఉండాలని సూచించారు. ప్యానల్‌ స్పీకర్‌గా బాలూ నాయక్‌ సభను బాగా నడుపుతున్నారని కితాబిచ్చారు. మహిళా ఎమ్మెల్యేల్లో బాగా చదువుకున్నవారు ఉన్నారని, వారు చర్చల్లో క్రియాశీలంగా ఉండాలని చెప్పారు. మిగిలిపోయిన అసెంబ్లీ కమిటీలను త్వరగా పూర్తిచేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాతో చిట్‌చాట్‌లు, వ్యక్తిగతంగా మాట్లాడడం వంటివి చేయొద్దని స్పష్టం చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత నష్టం ఉండదని, మొత్తం వ్యవస్థకే నష్టం చేస్తుందని చెప్పారు.


వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందన్నారు. పార్టీ, ప్రభుత్వ లైన్‌లోనే అందరూ స్పందించాలని సూచించారు. అందరి లెక్కలూ పార్టీ నాయకత్వం రాసుకుంటోందని, బీ ఫాంలు ఇచ్చేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. సభలో స్పీకర్‌ మైకు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే కావడానికి 30 ఏళ్లు పట్టిందని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసేందుకు మంత్రులు సమయం ఇవ్వాలని తెలిపారు. తానూ సమయం ఇస్తానన్నారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని, ఈ సారి బడ్జెట్లో భవిష్యత్తు ప్రణాళికలు ఉండబోతున్నాయని చెప్పారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా సమర్థంగా నడిపేలా చూడాలని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సబ్జెక్ట్‌ మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదని, కొట్లాడి మైక్‌ను తీసుకున్నామని గుర్తుచేశారు. సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేసి.. తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులూ సభకు రాకుండా చేశారన్నారు. సీఎల్పీ నేతలుగా ఉన్న జానారెడ్డి, భట్టివిక్రమార్కలకు కూడా మైక్‌ ఇవ్వలేదని చెప్పారు. ‘‘ఇది మన ప్రభుత్వం.. ఇప్పుడు మనం వేసుకునే రోడ్‌ మ్యాపే వచ్చే ఎన్నికలకు అజెండా అవుతుంది’’ అని రేవంత్‌ అన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మహేశ్‌గౌడ్‌

ఆరు గ్యారెంటీల విషయంలో ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు దీటుగా తిప్పికొట్టాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సూచించారు. సమావేశాలకు సభ్యులు సకాలంలో, విధిగా హాజరు కావాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.

వేం నరేందర్‌రెడ్డికి సీఎల్పీ అభినందన

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని సీఎల్పీ అభినందించింది. సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. సీఎల్పీ సమావేశం అనంతరం.. శాసనమండలి ప్రవేశ ద్వారం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌రెడ్డి గ్రూప్‌ ఫొటో దిగారు.

Updated Date - Mar 17 , 2026 | 04:36 AM