Share News

CM Revanth Reddy: జలవివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:51 AM

జలవివాదాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: జలవివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

  • ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి

  • మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపండి

  • తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ను సిద్ధం చేయండి.. ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని సేకరించండి

  • ఆ తర్వాతే సవరణ అంచనాలు పంపండి.. కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి

  • నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జలవివాదాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జలవివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని తెలియజేయాలని సూచించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ డీపీఆర్‌ను సిద్ధం చేసే ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం కన్సల్టెంట్ల ఎంపికను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ డిజైన్లకు ఏయే సంస్థలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలు ఏంటని ఆరా తీశారు. మంగళవారం తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సీఎం కార్యదర్శి మాణిక్కరాజ్‌ కన్నన్‌, ఈఎన్‌సీ (జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌, మాజీ ఈఎన్‌సీ సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు సీఈలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీలతో సంయుక్త భాగస్వామ్యం చే సుకునే సంస్థలకే పనులు అప్పగించనున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ డీపీఆర్‌ను మూడు నెలల్లోగా సిద్ధం చేసే బాధ్యతను కన్సల్టెన్సీ తీసుకుందని, ఆ సంస్థ డీపీఆర్‌ సిద్ధం చేయడానికి అవసరమైన సాంకేతిక వివరాలు సేకరిస్తోందని చెప్పారు.


డీపీఆర్‌ తయారీ యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను ప్రాధాన్య జాబితాలో పెట్టినందున వాటికి అవసరమైన భూమిని సేకరించాలని సూచించారు. భూసేకరణ కోసం అవార్డు కాగానే చెల్లింపులు చేపట్టాలన్నారు. భూసేకరణ తక్షణ ప్రాధాన్యంగా ఉండాలని స్పష్టం చేశారు. వెంటనే చెల్లింపులు చేయాలని చెప్పారు. భూసేకరణ బిల్లులను సమర్పించాలన్నారు. ప్రాజెక్టుల్లో భూసేకరణ పూర్తయ్యాకే సవరణ నిర్మాణ అంచనాల ఫైలును ప్రభుత్వానికి పంపించాలని సీఎం తెలిపారు. భూసేకరణ చేయకుండా సవరణ అంచనాల కోసం ఫైళ్లు పెడితే సహించేది లేదన్నారు.


కీలక ప్యాకేజీల పనులకు ప్రాధాన్యమివ్వాలి..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కల్వకుర్తి, సీతారామ, నెట్టెంపాడు, రాజీవ్‌బీమా, మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాలతో పాటు ఇందిరమ్మ వరద కాలువ వంటి ప్రాజెక్టుల్లో భూసేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు నిర్దేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల ప్రక్రియ కొలిక్కి వస్తే.. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ కాంపొనెంట్లలో కీలకమైన ప్యాకేజీల పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలతో ఫైలును సమర్పించాలని అధికారులకు రేవంత్‌ సూచించారు. భూసేకరణతో పాటు పునరావాసం, పునర్నిర్మాణం కోసం రూ.200 కోట్లు తక్షణమే అవసరమవుతాయని అధికారులు గుర్తు చేయగా.. వెంటనే బిల్లులు సమర్పించాలని సీఎం చెప్పారు.


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రాజెక్టులపై దృష్టి

తుమ్మడిహెట్టి బ్యారేజీ డీపీఆర్‌ పూర్తయ్యాక, ఆ ప్రాజెక్టుకు తగిన అనుమతులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందించే అవకాశం ఉందన్నారు. చనకా కొరాటా బ్యారేజీ కింద డిస్ట్రిబ్యూటరీలకు ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన కింద అనుమతులు తెచ్చుకొని, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయ్యేలా చూడాలని నిర్దేశించారు. ఈ నెల 16న చనాకా కొరాటా వద్ద పంప్‌హౌ్‌సతోపాటు సదర్‌మఠ్‌ బ్యారేజీ ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు.


ప్రజలకు సీఎం రేవంత్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికి సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగీ, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ అభివృద్థి పథకాలన్నీ ప్రతి కుటుంబానికి చేరాలనేది తమ సంకల్పమన్నారు. వ్యవసాయంతోపాటు పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవల రంగంలో తెలంగాణ తిరుగులేని పురోగతి సాధిస్తుందనే నమ్మకం తనకుందని సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ - 2047 విజన్‌ సాకారానికి తమ సర్కారు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్నారు. పతంగులు ఎగురవేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

Updated Date - Jan 14 , 2026 | 06:31 AM