Share News

నేడు దేవాదులకు సీఎం

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:54 AM

దేవాదుల ప్రాజెక్టు పురోగతి, నీటి విడుదల, ఇంకా చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రాజెక్టు పర్యటనకు వెళుతున్నారు.

నేడు దేవాదులకు సీఎం

  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులతో కలిసి పరిశీలన

  • భూసేకరణ, ఇతర అంశాలపై అక్కడే సమీక్ష

  • తర్వాత హైదరాబాద్‌లో రాష్ట్ర ఎంపీలతో భేటీ

  • అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులకు ఆహ్వానం

  • రాష్ట్రానికి అందాల్సిన నిధులు, ప్రాజెక్టుల

  • అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే అంశంపై చర్చ

  • కాంగ్రెస్‌ ఎంపీలతో రేవంత్‌రెడ్డి ప్రత్యేక భేటీ!

హైదరాబాద్‌/ఏటూరునాగారం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): దేవాదుల ప్రాజెక్టు పురోగతి, నీటి విడుదల, ఇంకా చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రాజెక్టు పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర శాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క కూడా వెళ్లనున్నారు. ఆదివారం సీఎం నివాసంలో జరిగిన భేటీలో దేవాదుల పరిశీలన, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు, కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా సోమవారం దేవాదులకు వెళ్లాలని నిర్ణయించారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రిజర్వాయర్లను నింపే కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 18 కల్లా ప్రాజెక్టు కింద ఉన్న అన్ని రిజర్వాయర్లను నింపాలని సాగునీటి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కార్యక్రమం పురోగతితోపాటు దేవాదుల పంపుహౌస్‌, ఇన్‌టేక్‌ వెల్‌ పనుల పురోగతిని, నీటి తరలింపు సామర్థ్యాన్ని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పరిశీలిస్తారు. అలాగే ఏఐబీపీ పథకం కింద నడుస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపైనా అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు. దేవాదుల పర్యటన అనంతరం సీఎం, మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.


తెలంగాణ ఎంపీలతో ప్రత్యేక భేటీ

ఈ నెల 20 నుంచి పార్లమెంటు వానాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో భేటీ ఏర్పాటు చేశారు. దేవాదుల నుంచి తిరిగి వచ్చాక ప్రజాభవన్‌లో నిర్వహించే సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. దీనికి కాంగ్రెస్‌ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు, బీజేపీ, ఎంఐఎం లోక్‌సభ సభ్యులను, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. భేటీలో వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధుల వివరాలను ఎంపీలకు అందిస్తారు. నిధుల సాధనకు కార్యాచరణపై చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం భట్టి నివాసంలో కాంగ్రెస్‌ ఎంపీలతో రేవంత్‌, భట్టి ప్రత్యేకంగా డిన్నర్‌ భేటీ నిర్వహించనున్నారు. ఏయే ఎంపీలు, ఏయే అంశాలపై పార్లమెంటులో మాట్లాడాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 04:59 AM