గాంధీ, గాడ్సే వారసుల మధ్య పోరు
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:43 AM
నీట్ ప్రశ్నపత్రాలను లీక్ చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి
లేదంటే తెలంగాణ నుంచే ‘సడక్ సే సంసద్’ పోరాటం
రాహుల్, ప్రియాంకపై దాడి చేయించిన కేంద్రం
కొడంగల్‌లో కాంగ్రెస్ నిరసనలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నాపై ఆ ‘రెండు పార్టీలు’ కుట్రలు చేస్తున్నాయి
కొడంగల్‌లో ఓట్లు తొలగించి దొంగదెబ్బ తీసే ప్రయత్నం
బీఎల్‌ఏలతో సమీక్షలో సీఎం.. సర్ ఫారం బీఎల్‌వోకు అందజేత
వికారాబాద్/కొడంగల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నీట్ ప్రశ్నపత్రాలను లీక్ చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్ నుంచి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ‘సడక్ సే సంసద్’ వరకు పోరాటాన్ని తెలంగాణ నుంచే ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిసే హక్కును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో పాశవిక దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదని, గాంధీ వారసులకు, గాడ్చే వారసులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. రాహుల్, ప్రియాంకపై పోలీసుల దాడి, అరెస్టును నిరసిస్తూ బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలను కోట్ల రూపాయలకు విక్రయించి విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేశారని ఆరోపించారు. ఇదుకు ధ ర్మేంద్ర ప్రధాన్‌ను, నిందితులను జైల్లో పెట్టాల్సిందిపోయి.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై, యువతపై పోలీసులు ప్రతాపం చూపించారని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న ఆడపిల్లల దుస్తులు చింపేసి.. వారిపై దాడి చేశారని, విద్యార్థుల తలలు పగులగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులు కనిపించడం లేదని, వారిని ఎక్కడికైనా తీసుకెళ్లారా? లేక కిడ్నాప్ చేశారో తెలియడం లేదని అన్నారు.
గాంధీ కుటుంబానికి కొత్తేమీ కాదు...
పోలీసులు జరిపిన పాశవిక దాడిలో రాహుల్‌గాంధీ రక్తం నేలపై చిందిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్తేమీ కాదని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ చివరి రక్తపుబొట్టు వరకు దేశం కోసమే జీవించారని తెలిపారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రధాని పదవిని సోనియాగాంధీ త్యాగం చేశారని, ఆంగ్లేయులతో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, దేశాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ పరీక్షల అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చి చర్చ జరగకుండా అడ్డుకుందని ఆరోపించారు. మోదీని గద్దె దించి.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో కూడా 2019 ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని సీఎం రేవంత్ అన్నారు. ఆ సంస్థ చేసిన పొరపాట్ల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ వారి పప్పులు ఉడకవని.. పేరు మార్చుకుని కేంద్రం వద్దకు వెళ్లిందని చెప్పారు. ఢిల్లీ బీజేపీ వారితో మాట్లాడుకుని ఆ సంస్థకు కేటీఆర్ కాంట్రాక్టు ఇప్పించారన్నారు. అదే సంస్థ ఇప్పుడు కేంద్రంలోని సీబీఎస్ఈ పేపర్ల మూల్యాంకనంలో కూడా పొరపాట్లు చేసిందని, దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అప్పుడే ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదన్నారు. దేశంలో ఏ పరీక్ష జరిగినా దాని వెనక ఒక కుంభకోణం ఉంటోందని ఆరోపించారు.
నాపై ఆ రెండు పార్టీల కుట్రలు..
బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కొడంగల్‌లో తనను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బుధవారం కొడంగల్‌లో తన నివాసంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఎల్‌ఏల సమావేశంలో ఎస్‌ఐఆర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వారి తప్పులను పట్టుకుని నిలదీస్తుండడంతో ఎదురు నిలవలేక దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిగా ఉన్న కొడంగల్‌లో దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పార్టీని అధికారంలో నుంచి దించడంతోపాటు మరో పార్టీని అధికారంలోకి రాకుండా ఆపినందుకు ఈ కుట్రలు చేస్తున్నారని, వీటిని కాంగ్రెస్ సైనికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 2,51,255 ఓట్లకుగాను ఇప్పటివరకు 1,96,620 ఓట్ల ప్రక్షాళన జరిగిందని, ఇంకా నమోదు చేసుకోని వారి సంఖ్య 54,635 ఓట్ల ప్రక్షాళన జరగాల్సి ఉందని సీఎం తెలిపారు. మిగిలిన 22 శాతాన్ని ఈ నెల 30లోగా పూర్తి చేసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కోరారు. గత ఎన్నికల్లో 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచామని, ఇప్పుడు మిగిలిన 54,635 ఓట్లను తొలగిస్తే గెలుపు కంటే మరో 20 వేల ఓట్లు మైనస్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఎన్నికల సంఘం పర్యవేక్షణలోని బీఎల్‌వోలు పనిచేసినా, చేయకపోయినా.. పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్‌ఏలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు.
ఓటు కోల్పోతే సర్వం కోల్పోయినట్లే..
ఓటరు జాబితాలో పేరు లేకుండాపోతే.. సర్వం కోల్పోయినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటు కోల్పోతే సంక్షేమ పథకాలు కోల్పోతారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 90 శాతం మంది కాంగ్రెస్‌కు ఓట్లేస్తారని, వీరితో పాటు మహిళలు, కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని చెప్పారు. దీనిపై బీఎల్‌ఏలు, పార్టీ ముఖ్య నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొడంగల్‌లోని తన నివాసంలో ఎన్యుమరేషన్ ఫారాలను సీఎం స్వయంగా పూర్తి చేసి.. బీఎల్‌వోకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు కల్వ సుజాత, వికాదారాసింగ్, ప్రశాంత్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.