కేంద్రంతో సఖ్యతగా..
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:28 AM
రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు.. అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేదు
వాటిని ఎన్నికల వరకే పరిమితం చేయాలి
నా సొంత పనుల కోసం ఢిల్లీకి రావట్లేదు
ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభించండి
ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూ సేకరణ చేస్తాం
హుస్సేన్‌సాగర్-ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్ నడపండి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి రేవంత్ విజ్ఞప్తి
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు ఇవ్వండి
ఫ్యూచర్‌సిటీ-బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ మంజూరు
చేయండి.. కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం వినతి
న్యూఢిల్లీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామన్నారు. ‘‘రాజకీయాలు అనేవి ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటాయి. ఎవరి ప్రయత్నం వాళ్లు చేసుకుంటారు. కానీ, ప్రస్తుతం అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఎక్కడైనా ఆలస్యం జరిగినా, సమాచార లోపం ఉన్నా అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. అందుకే పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారంటూ కొందరు గిట్టనివాళ్లు విమర్శిస్తున్నారని..
ఈ విషయాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. తానేమీ సొంత పనుల కోసం ఢిల్లీకి రావడం లేదని, ప్రజల కోసమే వస్తున్నానని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై సోమవారమే రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలను పిలిచి పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. వివాదాస్పద రాజకీయ అంశాలను పక్కనపెట్టి, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అభివృద్ధి పనులను అడ్డుకునే విమర్శలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
3 ట్రిలియన్ ఎకానమీ దిశగా తెలంగాణ
2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో తెలంగాణ భాగస్వామి అవుతుందని రేవంత్ ప్రకటించారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ, దేశ జీడీపీలో 5 శాతం భాగస్వామిగా ఉందని తెలిపారు. ఈ జీడీపీ వాటాను 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. అలాగే, ఆర్థిక వృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలకమని, అందుకే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణాన్ని తక్షణ ప్రాధాన్యంగా తీసుకున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. రామ్మోహన్‌తోపాటు ఆయన తండ్రి ఎర్రన్నాయుడితో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. మెట్రో అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీపై ఇంకా స్పష్టత రాలేదని, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మళ్లీ ఢిల్లీకి వచ్చి, మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టులు నిర్మించండి
తెలంగాణలో విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణాలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. మామునూరు(వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని.. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఢిల్లీలోని పౌరవిమానయాన శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు ఉన్న మెరుగైన పరిస్థితులను వివరించారు. రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతోపాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతో వరంగల్ కీలక నగరంగా ఉందని తెలిపారు. వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసినందున టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, 2028 జూన్ 2కల్లా పూర్తి చేయాలని కోరారు. కాకతీయ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్లు ఉండాలని సీఎం కోరగా.. రామ్మోహన్ నాయుడు సుముఖత వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఎయిర్‌పోర్టుతోపాటు పౌర విమానాశ్రయాన్నీ నిర్మించాలని రేవంత్ కోరారు. రెండు ఎయిర్‌పోర్టులకు అవసరమైన భూమిని సేకరించి ఇస్తామని తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలని కోరారు. వరంగల్, ఆదిలాబాద్ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణ సంస్థలు నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలని కోరగా.. ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర మంత్రి సూచించారు.