ఢిల్లీ పర్యటనకు సీఎం
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:37 AM
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో భేటీ కానున్నారు.
కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
బీజేపీ ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘చాయ్ పే చర్చ’
హైదరాబాద్, జూలై 13(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో భేటీ కానున్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూ సేకరణ పూర్తయిన నేపథ్యంలో, డిజైన్ల ఖరారుపైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్ పోర్టులో విమానాల రిపేర్లు, ఓవర్ హాలింగ్, మెయింటెన్స్, ఎయిర్ కార్గో సదుపాయాలను కల్పించాలని కోరనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు ఖట్టర్, గడ్కరీలను కలిసి మెట్రో రెండో దశ, ఆర్‌ఆర్‌ఆర్‌పైన చర్చించనున్నట్లు చెబుతున్నారు. కాగా.. ఢిల్లీ వెళ్లిన సీఎం.. అధిష్ఠానం పెద్దలనూ కలిసే అవకాశం ఉందని తెలిసింది.
బీజేపీ ఎంపీలతో సీఎం ఛాయ్ పే చర్చ
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజాభవన్‌లో సోమవారం తెలంగాణ ఎంపీలతో సమావేశం అనంతరం.. సీఎం రేవంత్‌రెడ్డి వారిని టీ తాగుదాం రమ్మంటూ ఆహ్వానించారు. ఈ తేనేటి భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంపై చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే విషయంలో సహకరించాలని బీజేపీ ఎంపీలను సీఎం రేవంత్ కోరారు. కేంద్రం నుంచి ఏ రకమైన సహకారం ఆశిస్తున్నారో.. రాష్ట్రం నుంచి కేంద్రానికి అదే విధమైన సహకారం ఉండాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకూ కోటా ఇవ్వాలని కోరారు. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం ప్రతిపాదనే ప్రయోజనకరమని చెప్పారు. ఎంఎంటీఎస్‌ను శంకర్‌పల్లి వరకు పొడిగించేలా ప్రతిపాదించాలని కోరారు. ఇక, ధాన్యం సేకరణ, ఇతర అంశాల్లో సహజంగా ఏర్పడే పాలనా పరమైన ఇబ్బందులు, వాటి పరిష్కారంపై ఈటల సీఎంకు సలహాలు అందించారు. కాగా, ప్రభుత్వంలోని 25 శాఖలకు సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రణాళికశాఖ 197పేజీలతో పుస్తకాన్ని ముద్రించింది. ఈ ప్రతులను ఎంపీలకు అందించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.