Share News

CM Revanth Reddy: ఫాంహౌస్‌లో శుక్రాచార్యుడు

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:15 AM

సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను రాక్షసుల గురువు శుక్రాచార్యుడితో పోల్చారు. బీఆర్‌ఎస్‌ కీలక నేతలైన కేటీఆర్‌, హరీశ్‌ను.. మారీచుడు, సుబాహుడుగా అభివర్ణించారు.

CM Revanth Reddy: ఫాంహౌస్‌లో శుక్రాచార్యుడు

అసెంబ్లీలో మారీచుడు, సుబాహుడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు

వారికి రాజకీయ సమాధి తప్పదు

2034 వరకు రాష్ట్రంలో ప్రజాపాలనే

రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా

ప్రధాని మోదీని కలుస్తుందీ అందుకే..

నాగోబా జాతరకు మరో 22 కోట్లు మంజూరు

300 కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణం

నిర్మల్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌

సదర్మాట్‌ బ్యారేజీని ప్రారంభించిన సీఎం

చనకా-కొరాటా ఆయకట్టుకు పెన్‌గంగా జలాలు

హత్తిఘాట్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం

నిర్మల్‌/ఆదిలాబాద్‌/మామడ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను రాక్షసుల గురువు శుక్రాచార్యుడితో పోల్చారు. బీఆర్‌ఎస్‌ కీలక నేతలైన కేటీఆర్‌, హరీశ్‌ను.. మారీచుడు, సుబాహుడుగా అభివర్ణించారు. ఫాంహౌస్‌లో ఉంటూ శుక్రాచార్యుడు, అసెంబ్లీలో ఆయన శిష్యులు మారీచుడు, సుబాహుడు తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి.. రాష్ట్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిపోయి.. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో నిర్మించిన సదర్మాట్‌ బ్యారేజీని సీఎం రేవంత్‌ ప్రారంభించారు. జిల్లాలో మహిళా సంఘాలకు రూ.657 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.386 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో 2034 వరకు ప్రజాపాలనే కొనసాగుతుందన్నారు.


తాను పదే పదే ప్రఽధాని మోదీని కలుస్తున్నానని కొందరు విమర్శలు చేస్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలిసేందుకు సిద్ధమని, అందుకే ప్రధానిని కలుస్తున్నానని చెప్పారు. గత పాలకులకు ఈ అవగాహన లేకనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. వారు చేసిన అప్పులే రాష్ట్రం పాలిట ముప్పుగా మారాయని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకునేందుకు వారు రాజకీయాలు చేయాలని, తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని తరచు కలవడంతోనే వరంగల్‌లో ఎయిర్‌పోర్టు వచ్చిందని, త్వరలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందని అన్నారు.


ఎర్ర బస్సు తిరగని ప్రాంతంలో ఎయిర్‌ బస్సు..

రాష్ట్రంలో ఎర్ర బస్సు తిరగని ప్రాంతంలో కూడా ఎయిర్‌ బస్సును తిప్పుతానని సీఎం రేవంత్‌ అన్నారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు మంజూరు చేయించి ప్రధానితో ప్రారంభం చేయిస్తానన్నారు. ఆదిలాబాద్‌ యూనివర్సిటీని బాసరలో ఏర్పాటు చేస్తామని, నిర్మల్‌లో అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నాగోబా జాతరకు మరో రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారత కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క- సారక్క జాతరకు సంబంధించి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రూ.300 కోట్లతో పనులు జరుగుతున్నాయని .. ఈ నెల 19న ప్రారంభించేందుకు అంతా సిద్ధమైందన్నారు. పది వేల ఎకరాల్లో ఆదిలాబాద్‌లో పారిశ్రామిక వాడ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. 430 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నగరాన్ని నిజాం విస్తరించడం వల్లే నేడు ఎన్నో పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు తమ ప్రభుత్వం సైతం ఎయిర్‌పోర్టుకు సమీపంలో 30 వేల ఎకరాలలో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తుంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులంటూ.. శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు తమపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సూచనలు చేయాలని, లేకపోతే ఫాంహౌస్‌లో పడుకోవాలని వ్యాఖ్యానించారు.


మున్సిపల్‌ ఎన్నికల్లో మంచోళ్లను గెలిపించండి..

రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో మంచివారిని గెలిపించాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో, మంత్రులతో కలిసి పనిచేస్తూ, పని చేయించుకునే వారిని గెలిపించాలన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల చొప్పున ప్రతి నెలా ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నామని వివరించారు. ఇక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా.. వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు హైదరాబాద్‌లో విలువైన స్థలాన్ని కేటాయించామని, మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్‌ లాంటి సంస్థలతో మాట్లాడి ఆన్‌లైన్‌లో విక్రయించేలా వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. తాను వచ్చిన పాలమూరు జిల్లాతో సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేస్తానని రేవంత్‌ ప్రకటించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్‌ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాగా, సదర్మాట్‌ బ్యారేజీకి దివంగత నేత పి.నర్సారెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని చనకా- కొరాటా ప్రాజెక్టుకు దివంగత నేత రామచంద్రారెడ్డి పేరును పెడుతున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని వేదికపై నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి జలాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. పోలవరం-నల్లమల సాగర్‌ను ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని తెలిపారు.

Updated Date - Jan 17 , 2026 | 05:49 AM