Share News

మూడేళ్లు అప్పగిస్తా.. కేసీఆర్‌.. సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో: సీఎం రేవంత్

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:01 AM

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు తొమ్మిదిన్నరే ళ్లు వాళ్లకు పాలన అప్పగిస్తే రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.

మూడేళ్లు అప్పగిస్తా.. కేసీఆర్‌.. సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో:  సీఎం రేవంత్

  • 3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా.. కేసీఆర్‌.. సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో

  • కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లు ఆర్థిక ఉగ్రవాదులు

  • రాష్ట్రం ఆర్థిక మూలాలను విధ్వంసం చేశారు

  • మ్యానిప్యులేషన్లో ముగ్గురిదీ ఒకటో ర్యాంకే

  • 3 బ్యారేజీలు నింపితే ఊళ్లే ఎగిరిపోతాయి

  • కేసీఆర్‌ పాలనలోనే ఎన్‌డీఎస్ఏ ఆ మాట చెప్పింది

  • కేసీఆర్‌ దుర్మార్గంపై కడుపు రగులుతోంది

  • చుక్కనీరు వాడకుండా 33 వేల కోట్లు కట్టాం

  • 30 నెలలైనా తనకు శిక్ష పడేలా చేయలేకపోయాం

  • కేసీఆర్‌కు వెయ్యెకరాల ఫాంహౌస్‌.. ఉత్తమ్‌కు ఇల్లేలేదు

  • చేసింది చెప్పడంలోనూ మా నేతలు విఫలమయ్యారు

  • కాళేశ్వరంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు తొమ్మిదిన్నరే ళ్లు వాళ్లకు పాలన అప్పగిస్తే రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1.21 లక్షల కోట్లకు చేర్చారన్నారు. రూ.1.02 లక్షల కోట్ల చెల్లింపులు చేసిన తర్వాత ప్రారంభించిన మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందన్నారు. ప్రజలు నమ్మి అధికారాన్నిస్తే ముగ్గురూ కలిసి విధ్వంసం సృష్టించారని, వారిది ఆర్థిక ఉగవ్రాదుల కుటుంబం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక మూలాలను దోపిడీచేసిన ఆ కుటుంబానికి ప్రజాకోర్టులో రెండుసార్లు తీర్పు ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, వచ్చిన రోజు నుంచే దోపిడీకి పాల్పడ్డారని, ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయలేదని ఆరోపించారు. తెలంగాణవాదులు కలలుగన్నది వేరు, కేసీఆర్‌ ఆలోచన, దృష్టి, చేరుకోవాలనే మజిలీ వేరు అన్నారు. మంగళవారం ప్రజాభవన్‌లో కాళేశ్వరం పునర్నిర్మాణం దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రజాప్రతినిధులకు వివరిస్తూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కాళేశ్వరంపై చర్చ పెట్టాలని కోరుతూ కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు.


తనకు ఎందుకు బ్యారేజీలు అప్పగించాలో కేసీఆర్‌ సభకు చెప్పి మెప్పించగలిగితే 3 బ్యారేజీలను ఆయనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వారం రోజులు కాదు, మూడేళ్లు అప్పగిస్తామని, ఎల్‌ అండ్‌ టీతో పాటు ఇతర కాంట్రాక్టర్లను తొలగించి, మేజర్‌ కాంట్రాక్టర్‌ కింద కేసీఆర్‌కు బ్యారేజీలు అప్పగిస్తామని ప్రకటించారు. కాంట్రాక్టర్లను 60సీ కింద టర్మినేట్‌ చేసి బ్యారేజీలు అప్పగిస్తామని, కేసీఆర్‌ తనకు కావాల్సిన వాళ్లందర్నీ పెట్టుకొని పని చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ వాదనలో బలం ఉంటే, ఏ తప్పుకు పాల్పడకపోతే సభకు రావాలన్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు. సాగునీటి నిపుణులను, అడ్వకేట్‌ జనరల్‌ను సభలోకి పిలిచి మరీ చర్చ పెడదామన్నారు. కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టులు వినియోగిస్తున్నామని. సచివాలయాన్ని కూడా వాడుకుంటున్నామని, ఆయన పథకాలన్నీ కొనసాగిస్తున్నామని చెప్పారు.


మేడిగడ్డ వెన్నుపూసలాంటిది

కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూసలాంటిదని ముఖ్యమంత్రి చెప్పారు. అందులో నాలుగు పూసలు ఊడితే చేయడానికి ఏమీ ఉండదని అన్నారు. కాళేశ్వరం బ్యారేజీలో నీళ్లు నింపే అవకాశాల్లేవని చెప్పారు. కేసీఆర్‌ రాకుండా మిడిమిడి జ్ఙానం ఉన్న వాళ్లను తోలి, మీరు అడిగి రాపోన్రి, సూద్దాం ఏమంటడో అని కేటీఆర్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యారేజీలకు పరీక్షలు చేసిన తర్వాత ముందుకెళ్లాలని, కాదని నింపితే బ్యారేజీలతో పాటు కింద ఉన్న వాళ్లంతా కొట్టుకుపోతారని ఎన్‌డీఎ్‌సఏ చెప్పిందన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే ఆ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. బ్యారేజీల విషయంలో ఎంత వేగంగా చేయాలో అంత వేగంగా పనిచేస్తున్నామన్నారు. నీళ్లు నింపుతారా లేదా? వారం రోజులు అప్పగించండి అంటున్న నేతలు తాటిచెట్టు లాగా పెరిగితే సరిపోదు.. తలకాయలో గుజ్జు ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడితే రాత్రింపగళ్లు అక్క డే ఉండి పనిచేయించే వాళ్లమన్నారు. ‘‘రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు దెబ్బతింటే నేరగాళ్లను శిక్షించలే కపోతున్నాం. అధికారంలోకి వచ్చి 30నెలలు అయింది. ప్రజలంతా వీరిని ఉరి తీయాలని కోరుకున్నారు. కమిషన్‌ నివేదికను కేంద్రానికి అప్పగించాం. 48 గంటల్లో విచారించి అందరినీ లోపలేస్తామన్న కేంద్ర ప్రభుత్వం 2025 సెప్టెంబరు 1న కేసు సీబీఐకి అప్పగిస్తే ఇంతవరకు కదలిక లేదన్నారు. ఢిల్లీ నుంచి నడుచుకుంటూ వస్తున్నట్లున్నారు, అడిగితే విమానం పంపేవాళ్లం కదా అని ఆయన వ్యాఖ్యానించారు.


చుక్కనీరు తాగకుండా 33 వేల కోట్లను కట్టాం

‘‘కేసీఆర్‌ కాళేశ్వరం కోసం రూ.97 వేల కోట్ల రుణం తెస్తే రూ.33 వేల కోట్లను ఏడాది వాయిదాల కింద చెల్లించామని సీఎం రేవంత్‌ చెప్పారు. చుక్క నీరు తాగకుండా అణా పైసా ప్రయోజనం లేకుండా ఒకే ఒక్క ప్రాజెక్టుకు ఇంత సొమ్ము చెల్లించాం’’ అని పేర్కొన్నారు. 30 నెలల్లో రూ.1.80 లక్షల కోట్లు అప్పు చేస్తే అదే వ్యవధిలో రూ.2.08 లక్షల కోట్ల అప్పులు చెల్లించామన్నారు. ఏ పథకాన్ని ఆపకుండా చెల్లిస్తున్నామని, కొత్త పథకాలను నడిపిస్తున్నామని, జీతాలు సకాలంలో చెల్లిస్తున్నామని ఆయన ప్రస్తావించారు.

బాంబులతో పేలిస్తే కుంగుతుందా?

మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చారని ప్రచారం చేస్తున్నారని, బాంబులు పెట్టి పేల్చితే గాల్లోకి ఎగురుతుందా? భూమిలోకి దిగుతుందా? నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్‌ కుటుంబం వల్ల తెలంగాణ రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలయిందని అన్నారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌, కేటీఆర్‌కు వంద ఎకరాల ఫామ్‌హౌస్‌, హరీశ్‌రావుకు 50 ఎకరాల ఫామ్‌హౌస్‌, కవితకు 25 ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉన్నాయని చెప్పారు. సామాన్యుడు 250 గజాల్లో కట్టుకోవాలంటే జీవితాంతం కష్టపడాలని, ఉత్తమ్‌కు సొంత ఇల్లే లేదని ప్రస్తావించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోబట్టే కేసీఆర్‌ కుటుంబం ఇంత శ్రీమంతులు అయ్యారని, న్యూస్‌ పేపర్లు, టీవీ చానళ్లు వచ్చాయని అన్నారు.


మ్యానుపులేషన్‌లో మాస్టర్‌లు

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లు నిజం లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి, వసూళ్లు చేసుకోవడంలో ఎలక్షన్‌లు, కలెక్షన్‌లలో ఎక్స్‌పర్ట్‌లు అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. చైతన్య, నారాయణ ఒకటో ర్యాంకు.. ఒకటో ర్యాంకు అన్నట్లు.. ఈ ముగ్గురికీ సమాన ర్యాంకు ఇవ్వాల్సిందేనన్నారు. 2022లో కాగ్‌ నివేదిక ప్రకారం కాళేశ్వరం అంచనాలు రూ.81911 కోట్ల నుంచి రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఊరు, పేరు, అంచనాలు మారి, తుమ్మిడిహెట్టి పక్కనపెట్టి, మేడిగడ్డకు చేర్చి రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు రూ.1.47 లక్షల కోట్లకు చేర్చారని అన్నారు. కాళేశ్వరం బ్రెయిన్‌ చైల్డ్‌ అని కేసీఆరే ప్రకటించారని, 2019లో ప్రారంభిస్తే 2020 లోనే లోపాలు బయట పడ్డాయని పేర్కొన్నారు. 2022 జూలై లో మేడిగడ్డ పంప్‌హౌస్‌ రిటైనింగ్‌ వాల్‌ కుప్పకూలి మోటార్లన్నీ దెబ్బతిన్నాయని, 2023లో ఏడో బ్లాకు కుంగిందని ప్రస్తావించారు. ఇళ్లు కట్టేటప్పుడు మేస్త్రీ కూడా నాలుగు ఫీట్లు పుునాది తవ్వి నేల బాగుందా అని చూసుకుంటాడని, మూడు బ్యారేజీలు అలాంటి పరీక్షలేవీ చేయకుండానే నిర్మించారని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పడే నాటికేరూ.6157 కోట్లు ఖర్చు

జలయజ్ఙంలో భాగంగా నాడు 16.40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టి తెలంగాణ ఏర్పడే నాటికీ రూ.6157 కోట్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం రేవంత్‌ చెప్పారు. కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం కేసీఆర్‌ రీ డిజైన్‌ చేశారని, ఆయన వేసిన ఇంజనీర్ల కమిటీ కూడా రీడిజైన్‌ ఆలోచనను తప్పుబట్టిందని ప్రస్తావించారు. మేడిగడ్డలో వద్ద ని, మార్చాల్సిందే అనుకుంటే వేమనపల్లిలో కట్టాలని చెప్పిందని వెల్లడించారు. ఆ నివేదికను తొక్కిపెట్టి వ్యాప్కోస్‌ ద్వారా అనుకున్న నివేదిక తెప్పించుకున్నారని ఆరోపించారు. వ్యాప్కోస్‌ హోటల్‌లో చెఫ్‌ లాంటిద ని, తుమ్మిడిహెట్టిపై రూ.38 వేల కోట్లతో ప్రాజెక్టు పూ ర్తయ్యేలా నివేదిక ఇచ్చిందని, కేసీఆర్‌ ఆదేశం మేరకు మూడు బ్యారేజీల ప్రతిపాదనను భారీ ఖర్చుతో సిద్ధం చేసిందని వివరించారు.


బ్యారేజీలు నీటి నిల్వకు కాదు

కొత్తగా రిజర్వాయర్లు కడితే తొలి ఏడాది 25 శాతం, రెండో సంవత్సరం 50 శాతం, మూడో సంవత్సరం 75 శాతం, నాలుగో సంవత్సరం పూర్తిగా నింపుతారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ మేడిగడ్డలో తొలి ఏడాది నుంచే 16 టీఎంసీలు నింపి బస్సుల్లో అందరినీ తీసుకెళ్లి చూపించి, ప్రచారం చేసుకున్నాడని, ఆయన పాపమే ఇక్కడికి తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారే ఎదురుదాడికి దిగి, ఇతరులపై నెట్టే ప్రయత్నం చేయడంతో ప్రజలకు వాస్తవాలు వివరించడానికి లెక్కలతో వచ్చామన్నారు.

ఒక్కరూ మాట్లాడరేం?

కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఇంతమంది ఉన్నా ప్రభుత్వ నిర్ణయాలను పొగుడుతూ మాట్లాడటం లేదని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. కేసీఆర్‌ అమలు చేసిన ఒక్క స్కీమ్‌ అయినా ఆపామా? మెరుగ్గా అమలు చేస్తున్నా మీరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతలేరు? ఎందుకు ఘాటుగా తిప్పి కొడతలేరు అని ఆక్షేపించారు. రైతు భరోసా పథకం సభను ఈ నెల 10వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజాప్రతినిధులంతా రావాలని ఆహ్వానించారు. ఇందిరాగాంధీ జయంతి నుంచి రూ.5 లక్షల బీమా పథకం ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - Jul 08 , 2026 | 06:29 AM