యువత మైదానాల్లోకి రావాలి
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:00 AM
యువత పబ్ కల్చర్‌ను వదిలి క్రీడా మైదానాల్లోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒకప్పుడు ఇండియన్ ఫుట్‌బాల్‌కు నర్సరీగా ఉండేదని.....
క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. హైదరాబాద్ ఒకప్పుడు ఇండియన్ ఫుట్‌బాల్‌కు నర్సరీ
దేశంలోనే అగ్రశ్రేణి క్రీడాకారులను అందించింది
డ్రగ్స్ కల్చర్‌పై ఉక్కుపాదం మోపుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): యువత పబ్ కల్చర్‌ను వదిలి క్రీడా మైదానాల్లోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒకప్పుడు ఇండియన్ ఫుట్‌బాల్‌కు నర్సరీగా ఉండేదని, మళ్లీ ఆ పూర్వవైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 74వ బీఎన్.మల్లిక్ మెమోరియల్ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ -2026 ముగింపు కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం 1950-60 కాలంలో దేశంలోనే అగ్రశ్రేణి క్రీడాకారులను అందించిందని తెలిపారు. 1966 ఒలింపిక్స్‌లో ఆడిన భారత ఫుట్‌బాల్ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు హైదరాబాదీలే కావడం మనకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ పోలీస్ ఫుట్‌బాల్ జట్టుకు కూడా దేశంలో మంచి పేరుందన్నారు. యువత నెమ్మదిగా క్రీడలకు దూరమవుతున్నారని, క్రీడా మైదానాలను వదిలిపెట్టి తప్పు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దక్షిణ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని నేను సందర్శించాను. 30 ఎకరాల్లో ఉన్న స్పోర్స్ యూనివర్సిటీ అనేక బంగారు పతకాలు సాధించింది. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం నుంచి ఒక్క బంగారు పతకం కూడా సాధించలేకపోయాం. నాలుగు కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 30కి పైగా పతకాలు సాధించింది’’ అని సీఎం వివరించారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీలో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు బోర్డు సభ్యులుగా ఉండి.. యువతకు శిక్షణ ఇస్తారని చెప్పారు.
పంజాబ్‌లా మారనివ్వం..
యువత డ్రగ్స్, పబ్ కల్చర్‌కు బానిసలవుతున్న తీరుపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. బాగా చదువుకున్న వారే డ్రగ్స్ బారిన పడుతుండటం దురదృష్టకరమన్నారు. ‘ఒకప్పుడు వీరులను అందించిన పంజాబ్.. డ్రగ్స్ వల్ల ఎలా దెబ్బతిన్నదో చూస్తున్నాం. మన రాష్ట్రాన్ని మరో పంజాబ్‌గా మారనివ్వం’ అని అన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలను నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారిందని, ఏఐ వంటి సాంకేతికతను జాగ్రత్తగా వాడాలని సూచించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, రూ.2 కోట్ల నగదు పురస్కారం ఇచ్చామని, క్రికెటర్ సిరాజ్‌కు నిబందనలు సడలించి మరీ డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని గుర్తు చేశారు. పారా ఒలింపియన్ దీప్తికి కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామన్నారు. తెలంగాణ బిడ్డలకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని కలిసే అవకాశం కల్పించి.. యువతలో స్ఫూర్తి నింపామని అన్నారు. క్రీడల్లో రాణించే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావడం ఖాయమన్నారు.