Share News

లోక్‌సభలో వద్దు..అసెంబ్లీల్లో సీట్లను పెంచండి!

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:34 AM

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రజలతో నేరుగా మమేకం కావడమేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. ఢిల్లీలో ఉండి చట్టాలు చేసే లోక్‌సభ, రాజ్యసభలలో సీట్లను పెంచడం కంటే...

లోక్‌సభలో వద్దు..అసెంబ్లీల్లో సీట్లను పెంచండి!

  • ప్రజలతో ఎమ్మెల్యేలకే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది

  • తెలంగాణలో శాసనసభ స్థానాలను 200కు పెంచాలి

  • పునర్విభజన యత్నం వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర

  • బలం ఉంది కదా అని మోదీ.. దేశానికి రాజు కాలేరు

  • ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రజలతో నేరుగా మమేకం కావడమేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. ఢిల్లీలో ఉండి చట్టాలు చేసే లోక్‌సభ, రాజ్యసభలలో సీట్లను పెంచడం కంటే, క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి ఉండే శాసనసభ స్థానాలను పెంచాలని ప్రతిపాదించారు. శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ‘పార్లమెంట్‌ సభ్యుడు కేత్రస్థాయికి వెళ్లి చేయాల్సిందేమీ పెద్దగా ఉండదు. చట్టాలు చేయడానికి పార్లమెంట్‌ వ్యవస్థ ఉంది. శాసనాలను అమలు చేసేందుకు అసెంబ్లీ, స్థానిక సంస్థల వ్యవస్థలున్నాయి. వీటిని మూడు భాగాలుగా చూడాలి. ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం ఎమ్మెల్యేకు ఉంటుంది కానీ ఎంపీకి ఉండదు. కాబట్టే ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలి. తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి. వాటిని 200కు పెంచండి. ఒక పార్లమెంట్‌ స్థానం పరిధిలో సగటున ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 10 లేదా 12 చేయండి. 2 లక్షల జనాభాకు ఒక ఎమ్మెల్యేను చేయండి’ అని రేవంత్‌రెడ్డి సూచించారు. డీఎం (జిల్లా కలెక్టర్‌), సీఎం, పీఎం.. ఈ ముగ్గురి పనులు వేర్వేరని చెబుతూ.. డీఎం పని ప్రధాని చేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘గ్రామాలు, మండలాల్లోని సమస్యలు పార్లమెంట్‌ వరకూ వస్తాయా? గ్రామాల్లో పని చేసేందుకు సర్పంచ్‌, వార్డు మెంబర్లు ఉన్నారు. మునిసిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నారు. బడ్జెట్‌ ఇచ్చేందుకు అసెంబ్లీలు ఉన్నాయి. జాతీయ సమస్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు పార్లమెంట్‌ ఉంది. ఆ పాలసీలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పంచాయతీలు, అసెంబ్లీలు ఉన్నాయి. వాళ్లు రాజ్యాంగం లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నా కొన్నింటిని వారు మార్చలేరు. ప్రజాస్వామ్యాన్ని కాదని నియంతగా మారి చట్టాలు మార్చుతా అంటే కుదరదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. లోక్‌సభను 150 రోజుల నుంచి 50 రోజులకు కుదించారని, సభలో మాట్లాడేందుకు సభ్యులకే అవకాశం దొరకడం లేదని చెప్పారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుందన్నారు.


ఆ ఆలోచన వెనుక పెద్ద వ్యూహం

కేంద్ర ప్రభుత్వం ఎంపీ స్థానాలను పెంచాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహం ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. వారికి ఎక్కడ పట్టుందో అక్కడ సీట్లు పెంచి, పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించి, రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారని చెప్పారు. రాజ్యసభ, లోక్‌సభ స్థానాలు పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రతీ రాష్ట్రంలో ఇప్పుడున్న ఎంపీ స్థానాల సంఖ్యనే కొనసాగించాలని కేంద్రానికి సూచించారు. బలం ఉంది కదా అని రేపు దేశానికి నేనే రాజు అని మోదీ సవరణ బిల్లు తెచ్చుకుంటానంటే అది చెల్లదన్నారు. ఇలాంటి నేతలు కలియుగంలో పుడతారనే.. ఆనాడే అంబేద్కర్‌ తదితర నేతలు మన రాజ్యాంగాన్ని ఎంతో బలంగా రూపొందించారని చెప్పారు. ఏ అంశాల్లో రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చో.. ఏ అంశాల్లో చేయటానికి వీల్లేదో చాలా స్పష్టమైన నిబంధనలున్నాయన్నారు. అధికారం ఉంది కదా అని రాజ్యాంగ పునాదులనే కదిలిస్తామంటే కుదరదని, అలా ఆలోచించిన వారే కుప్పకూలిపోతారని హెచ్చరించారు. బీజేపీకి తెలుగుదేశం పార్టీ మద్దతుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘తమతో స్నేహం చేసే వారికి బీజేపీ వాళ్లు నష్టం చేస్తుంటారు. అందుకు నితీష్ కుమార్‌, ఏక్‌నాథ్‌ షిండే, నవీన్‌ పట్నాయక్‌ ఉదాహరణ. బీజేపీ వాళ్లు బలహీనంగా ఉన్నప్పుడు ఇతరుల్ని అక్కున చేర్చుకుంటారు. తాము బలంగా ఉన్నప్పుడు ఆ మిత్రపక్షాలను మింగేస్తారు’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 19 , 2026 | 05:35 AM