Share News

కలిసి సాధిద్దాం!

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:30 AM

తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

కలిసి సాధిద్దాం!

  • రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేద్దాం

  • మెట్రో రైలు పనులు ముందుకు సాగేలా చూడండి

  • ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం రావాల్సి ఉంది

  • మూసీ టెండర్లు అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కిందకు వచ్చేలా చూడాలి

  • తుంగభద్రలో పూడిక తొలగింపుకు కేంద్ర మంత్రి ఓకే.. మీరూ కలవండి

  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుద్దాం

  • గోదావరి-కావేరీ అనుసంధానంతో మనకు నీళ్లు, నిధులు వస్తాయి

  • ఎంపీలకు సీఎం రేవంత్‌ నిర్దేశం

  • పార్టీలకతీతంగా ఎంపీలు ఏ సమాచారం అడిగినా ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఎంపీలకు ప్రజా భవన్‌లో సోమవారం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఏర్పాటు చేశారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరం. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలి. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో 95 శాతం భూ ేసకరణ పూర్తయింది. ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మూసీ పునరుజ్జీవ పనుల్లో మొదటి దశ టెండర్లకు వచ్చింది. వీటిని అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద తీసుకునే విషయంలో కేంద్రం అప్రూవల్‌ లెటర్‌ ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలి’’ అని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు.


హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం, ఫేజ్‌-2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం రేవంత్‌ ఎంపీలకు వివరించారు. ఇందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌ని కన్సల్టెంట్‌గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. అంతరాష్ట్ర నదీ జలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను ఎంపీలకు సీఎం రేవంత్‌ వివరించారు. ‘‘తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీలు రావాలి. పూడిక కారణంగా 5 టీఎంసీలకు మించి రావడం లేదు. డ్యామ్‌తోపాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని పాటిల్‌ను కోరాం. ఈ అంశంపై ఎంపీలు కేంద్రమంత్రిని కలవాలి’’ అని సూచించారు.


గోదావరి-కావేరి అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు తీసుకునే విషయమై ఛత్తీస్‌గఢ్ ను ఒప్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘‘గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కు 300 టీఎంసీల వాటా ఉంది. దానిని ఛత్తీస్‌గఢ్ వాడుకోవట్లేదు. భవిష్యత్తులో ఆ రాష్ట్రం 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీల మిగులు ఉంటుంది. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’’ అని సీఎం రేవంత్‌ సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్‌గఢ్ వి అయితే నిధులు కేంద్రానివని, ఆ రెండింటిని తెలంగాణకు అనుకూలంగా సాధించాలని ఉద్బోధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) ఇవ్వాల్సి ఉందని, వాటిపై కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌, ఏపీ సీఎంతో చర్చించామని, వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్‌వోసీలు వస్తే అడ్డంకులు తొలగిపోతాయని చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 150-151 అడుగుల్లో నిర్మించేందుకు అనుమతి కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవస్‌తో భేటీ అవుదామని తెలిపారు.

ఎయిర్‌పోర్టులపై ప్రత్యేక దృష్టి సారించండి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైకి వెళ్లే బుల్లెట్‌ రైళ్లకు సంబంధించిన అలైన్‌మెంట్లు కొలిక్కి వచ్చాయని సీఎం రేవంత్‌ తెలిపారు. ఆదిలాబాద్‌ ఢిపెన్స్‌ ఎయిర్‌పోర్ట్‌, వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌లకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేశామని, వీటిలో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవర్‌ హాలింగ్‌), ఎయిర్‌ కార్గోలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, వీటిపై ఎంపీలు దృష్టి సారించాలని కోరారు.


ఎంపీలడిగే సమాచారం ఇవ్వండి

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ అంశాల విషయంలో ఏ సమాచారం కావాలన్నా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు అడిగిన సమాచారం వేగంగా వారికి అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్‌ డాక్టర్‌ మల్లు రవికి సూచించారు. పార్టీలకతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కోఆర్డినేషన్‌కు ఐఏఎస్‌ అధికారి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ను నియమించామని చెప్పారు. పెండింగ్‌ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా ఎంపీలు ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటు చేయాలని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. రాష్ట్రంలో పండే ధాన్యానికి తగిన మిల్లింగ్‌ సామర్థ్యం లేదని, స్టోరేజీ సమస్య ఉందని ఎంపీ ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంపీలంతా ఏదో ఒక స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టెన్సీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారని, ఆ సమాచారం తీసుకొని ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్‌ విషయాలు తెలియజేస్తే సమావేశాల్లో తాము చర్చించేందుకు వీలుంటుందని ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి డిజైన్లలోనే లోపాలున్నాయని, ఈ అంశంపై నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్‌, కడియం కావ్య, రఘురామిరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, రఘువీర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 06:44 AM