Share News

తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారండి

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:44 AM

అమెరికాలోని విద్యార్థులు తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో స్వల్పకాలిక కోర్సు చదవడానికి వెళ్లిన రేవంత్‌..

తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారండి

  • దేశాభివృద్ధిలో తిరిగి భాగస్వాములు కండి.. అమెరికాలోని విద్యార్థులకు సీఎం రేవంత్‌ పిలుపు

  • హార్వర్డ్‌లో చివరిరోజు బిజీ బిజీగా గడిపిన సీఎం

  • కృత్రిమ మేధపై కీలకోపన్యాసం చేయండి

  • రేవంత్‌రెడ్డికి హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌ ఆహ్వానం

  • ప్రజలను చైతన్యపరిచిన వీరుడు గద్దర్‌: రేవంత్‌

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని విద్యార్థులు తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో స్వల్పకాలిక కోర్సు చదవడానికి వెళ్లిన రేవంత్‌.. తన పర్యటనలో చివరిరోజు శనివారం యూనివర్సిటీలో పలువురు ప్రతినిధులు, బృందాలను, మసాచుసెట్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), కొలంబియా యూనివర్సిటీతోపాటు పలు క్యాంప్‌సల విద్యార్థులు, పూర్వ విద్యార్థులను కలుసుకొని.. వారితో చర్చిస్తూ బిజీ బిజీగా గడిపారు. నాయకత్వం, విజయాలు సాధించడం, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి నమూనాలు, పర్యావరణ సమస్యలు, రైతులు, మహిళలు, యువతపై దృష్టి సారించిన అంశాలు, సంక్షేమంతోపాటు దార్శనికతను వివరించాలని వారు సీఎంను కోరారు. అయితే బోధించినట్లుగా కాకుండా ఏకాభిప్రాయం సాధించడం, అభ్యాసంతో కూడిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని సీఎం చెప్పారు. భారతదేశంలో రానున్న రోజుల్లో తెలంగాణ, అందులోనూ హైదరాబాద్‌ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. భారత దేశాభివృద్ధిలో తిరిగి భాగస్వాములు కావాలని, తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లు కావాలని సీఎం సూచించారు. తెలంగాణ రైజింగ్‌-2047 అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ప్రభావ వర్గాలను ఇందులో భాగస్వాములను చేశామన్నారు. ఇదిలా ఉండగా.. హార్వర్డ్‌ యూనివర్సిటీలోని కెనెడీ స్కూల్‌లో కృత్రిమ మేధపై వచ్చే మార్చిలో జరిగే తొలి విధాన సదస్సులో కీలకోపన్యాసం చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఆ స్కూల్‌ నిర్వాహకులు కోరారు. కెనెడీ స్కూల్‌ డీన్‌ జెరెమీ విన్‌స్టెయిన్‌ స్వయంగా రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. దీంతో హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో హాజరై.. కీలకోపన్యాసం చేస్తానని రేవంత్‌ హామీ ఇచ్చారు.


ప్రజలను చైతన్యపరిచిన వీరుడు గద్దర్‌: రేవంత్‌

అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచిన పోరాట వీరుడు గద్దర్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం గద్దర్‌ జయంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళులర్పించారు. సమాజంలో అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్‌ అని కొనియాడారు. గద్దర్‌ జయంతిని ప్రజాప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన పేరుతో అవార్డు నెలకొల్పి, ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. గద్దర్‌ పాటలు, ఆలోచనలు, పోరాట స్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 06:45 AM