Share News

బీఆర్‌ఎస్.. శవంతో సమానం

ABN , Publish Date - Apr 28 , 2026 | 05:50 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ పార్టీ పెట్టిన ఉద్దేశం (పర్పస్‌) పూర్తయిందని, ఇక ఆ పార్టీకి మనుగడ లేదని అన్నారు.

బీఆర్‌ఎస్.. శవంతో సమానం

  • దానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదు.. పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తయింది

  • ఇక ఆ పార్టీకి గతమే తప్ప.. భవిష్యత్తు లేదు

  • కేసీఆర్‌ నాకు ప్రత్యర్థే కానీ.. శత్రువు కాదు

  • ఆయన చావును కోరుకునేవాణ్ని కాను

  • కవిత ప్రశ్నలకు కేసీఆర్‌ జవాబు చెప్పాలి

  • వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు

  • బీజేపీతో బీఆర్‌ఎస్‌ కలవబోదని కేసీఆర్‌ తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి చెప్పాలి

  • పంపకాల పంచాయితీ వల్లే కొత్త పార్టీ

  • రాష్ట్రంలో కాంగ్రెస్‌ కూటమి,

  • బీజేపీ-బీఆర్‌ఎస్‌ కూటమే ఉంటాయి

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు త్వరలోనే కొలిక్కి

  • మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌

కేసీఆర్‌కు ఏదైనా చెడు జరిగితే వారసత్వంగా ఆయన కుటుంబానికి లాభం జరుగుతుంది కానీ, నాకేం వస్తుంది? చరిత్రలో ఔరంగజేబు కుటుంబం నుంచి నేపాల్‌ యువరాజు కుటుంబం వరకు అధికారం కోసమే హత్యలు జరిగాయి

- సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ పార్టీ పెట్టిన ఉద్దేశం (పర్పస్‌) పూర్తయిందని, ఇక ఆ పార్టీకి మనుగడ లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తుతం శవంతో సమానమని, దానివల్ల ఏ ప్రయోజనమూ లేదని, శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌కు ఇక గతమే తప్ప.. భవిష్యత్తు లేదన్నారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్‌ హాల్లో మీడియాతో ముఖ్యమంత్రి చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రతిదీ ఒక ఉద్దేశం కోసమే ఏర్పాటవుతుందని, ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత అది గతం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశంతో ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ, మంత్రుల కమిటీ తదితరాలు ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత గతమైపోయాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకున్న ప్రజలు.. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఎంత అహంభావం ప్రదర్శించినా, బాధ్యతా రహితంగా వ్యవహరించినా చూసీ చూడనట్లుగా వదిలేశారని తెలిపారు.

Untitled-4 copy.jpg


అలాగే ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో కుటుంబ పాలనను, అహంకారాన్ని కూడా భరించారని పేర్కొన్నారు. కానీ, అది భరించలేని స్థాయికి చేరుకోవడంతో 2023 ఎన్నికల్లో ఓడించారని, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇక కాలం చెల్లిపోయిందని, ఆ కుటుంబంతో తెలంగాణ ప్రజలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని అన్నారు. కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందేందుకు తెచ్చిపెట్టుకున్న వినయం, నటన, ముసుగులతో తెలంగాణ ప్రజల్ని కేసీఆర్‌ కుటుంబం మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.


పంపకాల పంచాయితీతోనే కొత్త పార్టీ..

కేసీఆర్‌ కుటుంబంలో పంపకాల పంచాయితీ వల్లే కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, కానీ.. కుటుంబమంతా ఒక్కటేనని సీఎం రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని స్పష్టం చేశారు. ఆయన చావును కోరుకునే వ్యక్తిని కాదన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉండగానే కేటీఆర్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలంటూ తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ సహా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రకటనలు చేయలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్న ప్రజాప్రతినిధి అని, ఆయన వారసత్వం కోసం ఎదురుచూసేవారే ఆయన చావును కోరుకుంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ వారసత్వ రాజకీయాలకు, కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ప్రస్తుతం వారిలో వారు పోటీ పడుతున్నారని, ఎవరు ఎలిమినేట్‌ అయి.. ఎవరు బయటపడతారో చూడాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కవిత కొత్త పార్టీపై స్పందిస్తూ.. అది వారి ఇంట్లో పంచాయుతీ అని, తనకు ఆసక్తి లేదని అన్నారు.


బీజేపీది శిఖండి రాజకీయం..

నియోజకవర్గ పునర్విభజన విషయంలో బీజేపీ శిఖండి రాజకీయం మానుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్‌, నియోజకవర్గ పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలు.. ఒకదానికొకటి సంబంధం లేని అంశాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ చట్టంలో 2026 జనగణన నిబంధనను తొలగిస్తే సులభంగా అమలు చేయవచ్చునని తెలిపారు. ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తయి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయవచ్చునన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలనే మరో 25 ఏళ్లు యథాతథంగా ఉంచి 2008 మోడల్‌లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పునర్విభజన చేస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండబోదని అన్నారు. లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపుపై ముందే నిర్ణయం తీసుకుని.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరుతో చర్చ పెడితే ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. సీట్ల సంఖ్య ఎలా పెంచాలన్నదానిపై విస్తృత చర్చ జరగాలన్నది తమ విధానమని చెప్పారు. జమిలి ఎన్నికలపై బీజేపీ నాయకులు తలుపులు మూసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను పెంచలేరని సీఎం రేవంత్‌ అన్నారు. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రాతిపదికలు ఉన్నాయని పేర్కొన్నారు.


లోక్‌సభలో బీజేపీకి 2/3 మెజారిటీ లేదని తెలిసీ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టిన ఆ పార్టీ.. తమను తప్పుబడితే ఎలా? అని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మహిళా రిజర్వేషన్‌ అంశానికి రిఫెరెండం అని బీజేపీ చెప్పాలని సవాల్‌ విసిరారు. బీజేపీ చెప్పినట్లు వినడానికి తామేమీ ఆ పార్టీ సబార్డినేట్లం కాదన్నారు. లోక్‌సభ సీట్లను 50 శాతం చొప్పున పెంచాలంటూ ప్రధాని మోదీకి ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. బాగా పనిచేసే రాష్ట్రాలను శిక్షించే అధికారం కేంద్రానికి లేదన్నారు. పెంచే సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, 50 శాతం మెరిట్‌ ఆధారంగా రాష్ట్రాలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అందరి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారని, త్వరలోనే ఈ కేసు కొలిక్కి రానుందని సీఎం తెలిపారు. ఈ కేసును హైకోర్టు సుమోటోగా పర్యవేక్షిస్తోందన్నారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు

తేజస్వి సూర్య అనే వెధవ లోక్‌సభలో తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్‌ వెధవలు నోరు మెదపలేదంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య అదే లోక్‌సభ వేదికగా మాట్లాడటం బీఆర్‌ఎస్‌ వెధవలకు వినిపించలేదా?’ అని రేవంత్‌ ప్రశ్నించారు. వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. కవిత కొత్త పార్టీ పెడుతూ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ మరమనిషి అని, ఆయన చుట్టూ పందికొక్కులు చేరాయని, అవినీతిని ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని కవిత చేసిన విమర్శలకు జవాబివ్వాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్‌ కూటమి, బీజేపీ-బీఆర్‌ఎస్‌ కూటమి ఉండబోతున్నాయన్నారు. గత పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే పోటీ చేశాయని తెలిపారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ కలవబోదని కేసీఆర్‌ తాను నమ్మిన దేవుడిపై ఒట్టేసి చెప్పాలని సవాల్‌ చేశారు.

Updated Date - Apr 28 , 2026 | 05:54 AM