Share News

మూసీ ప్రక్షాళన మాకు శివదీక్షే

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:10 AM

‘‘ఎవరెన్ని విమర్శలు చేసినా.. అడ్డంకులు సృష్టించినా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా మూసీ నది ప్రక్షాళనను పూర్తి చేసి తీరుతాం. ఇది మా శివదీక్ష. దీనిపై ఎవరైనా దుష్ప్రచారం చేసినా..

మూసీ ప్రక్షాళన మాకు శివదీక్షే

  • అడ్డుకుంటే శివ తాండవమే

  • మానవ తప్పిదాలను సరిదిద్దకపోతే చరిత్ర క్షమించదు

  • రామప్ప నమూనాతో ఓంకారేశ్వరం

  • ఈ అభివృద్ధిని చూపించి ఓట్లు అడగం: సీఎం రేవంత్‌

  • మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎవరెన్ని విమర్శలు చేసినా.. అడ్డంకులు సృష్టించినా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా మూసీ నది ప్రక్షాళనను పూర్తి చేసి తీరుతాం. ఇది మా శివదీక్ష. దీనిపై ఎవరైనా దుష్ప్రచారం చేసినా.. పెడర్థాలు అంటగట్టినా రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. మానవ తప్పిదాలతో కనుమరుగయ్యే ప్రమా దం నుంచి హైదరాబాద్‌ను కాపాడి భవిష్యత్తు తరాలకు అత్యద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే రాష్ట్రప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. మూసీ రి వర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులో భాగంగా గండిపేట చెరువు దిగువన మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. మచిలేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోపూజ నిర్వహించి, ఎన్కపల్లిలో వంద ఎకరాల్లో నిర్మించే గోశాలకు ఇక్కడి నుంచే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం. మూసీ ప్రక్షాళనకు రాష్ట్రంలో చాలామంది ప్రజా ప్ర తినిధులు ప్రయత్నం చేశారు. కారణాలు ఏవైనా ముందుకు సాగలేదు.


ఆ అవకాశం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. మూసీ తీరాన ఉన్న ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. అది కనుమరుగు కాకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన’’ అని తెలిపారు. అడ్డంకులు సృష్టించినా.. వాటిని ఈశ్వరుడే తొలగిస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్యకారకంగా మారిందని, వాటిని సరిదిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడం ఏ సంస్కృతని ప్రశ్నించారు. పరీవాహక ప్రాంతాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా, ప్రత్యేకమైన ధ్యాన మందిరాలతో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. నదిని ప్రక్షాళన చేయాలని మూసీ పరీవాహక ప్రజాప్రతినిధులంతా కోరుతున్నారని, స్వార్థ, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి కొంతమంది మాత్రం తాము చేయలేని పనిని ఎవరూ చేయొద్దని, చేస్తే వాళ్లకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో అడ్డుకుంటున్నారని విమర్శించారు.


దక్షిణ కాశిగా మంచిరేవుల

హైదరాబాద్‌ మత సామరస్యానికి వేదిక అని, అందుకు అనుగుణంగానే.. గండిపేట వద్ద ఓంకారేశ్వర ఆలయం; మక్కా మసీదు ప్రాంతంలో అద్భుతమైన మసీదు; గౌలిగూడ ప్రాంతంలో సిక్కుల కోసం స్వర్ణ దేవాలయం తరహాలో గురుద్వారా; నాగోల్‌ ప్రాంతంలో అద్భుతమైన చర్చి నిర్మించబోతున్నామని ప్రకటించారు. రుద్ర దేవుడు నిర్మించిన రామ ప్ప మందిరాన్ని నాడు దర్శించుకొని ప్రజా పాలన తెస్తామని చెప్పామని, రామప్ప మందిర ఆలయ నమూనానే ఈరోజు మంచిరేవులలో నిర్మించాలనుకుంటున్నామని తెలిపారు. ‘‘మూసీ ప్రక్షాళనే కాదు.. గొప్ప పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా రాణించేలా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరంతా అండగా నిలబడండి. ఆశీర్వదించండి. ఈ అభివృద్ధిని చూపించి ఓట్లు అడగం. ఓట్లు.. నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు’’ అని సీఎం స్పష్టం చేశారు.


అక్కా.. ఎన్జీటీలో వేసిన కేసు ఉపసంహరింపజేయండి

‘‘ఒక అక్క కుటుంబం ఈ ప్రాంతం నుంచి 45 ఏళ్లుగా నూటికి నూరు శాతం రాజకీయ ప్రయోజనం పొందుతూ ఉంది. ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించారు. రాష్ట్రంలో అక్కకు గుర్తింపు వచ్చింది. కానీ, మూసీ ప్రక్షాళన ఆపాలంటూ అక్క కొడుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసు వేసిండు. ఇలాంటి తప్పుడు కేసు వేస్తుంటే అక్క మనసు ఎట్లా ఒప్పుకున్నదో’’ అని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు వాళ్ల కుటుంబాన్ని ఆశీర్వదించారని, అయినా, ఇక్కడి అభివృద్ధిని అడ్డుకోవడానికి స్థానికుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసు వేశారని మండిపడ్డారు. ఎన్జీటీలో వేసిన కేసును తక్షణమే ఉపసంహరింపజేయాలని, లేకపోతే, ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ‘‘వాళ్ల వెనక ముసుగు తొడుక్కొని దాక్కున్న వారికి కూడా చెబుతున్నా. మీవల్ల గాని పనులు మేం చాలా చేస్తున్నాం. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలేదు. ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు మానేయుర్రి’’ అంటూ బీఆర్‌ఎ్‌సకు హితవు పలికారు.


  • ఎన్కపల్లిలో..ఆధునిక గోశాల

  • రూ.157 కోట్లతో 99 ఎకరాల్లో నిర్మాణం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఎన్కపల్లిలో ప్రతిపాదిత ఆధునిక గోశాల నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. పశు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునిక గోశాలను ఎన్కపల్లిలో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సంప్రదాయ విలువలను ఆధునిక శాస్త్రీయ విధానాలతో సమన్వయం చేస్తూ పశువుల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, ప్రజల్లో గోసేవపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఇందుకు ఎన్కపల్లిలో 99.14 ఎకరాలు కేటాయించారు. గోశాల అంచనా వ్యయం సుమారు రూ.157 కోట్లు. కనీసం వెయ్యి ఆవులను సంరక్షించేలా ఇక్కడ ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. బీఐఎస్‌ ప్రమాణాల ప్రకారం గోపూజ కోసం ఆలయ సముదాయం, గోశాల షెడ్లు, క్వారంటైన్‌ సౌకర్యాలు, అత్యవసర చికిత్స విభాగం, మిల్కింగ్‌ పార్లర్‌, పాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ తదితరాలు నిర్మించనున్నారు. అలాగే, ఔట్‌ పేషెంట్‌ విభాగం, శస్త్రచికిత్స గది, ఐసొలేషన్‌ వార్డులు, ఫార్మసీ, ఎక్స్‌-రే గది, పాథాలజీ ల్యాబ్‌ తదితర సౌకర్యాలతో కూడిన ఆధునిక పశువైద్య ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు. బయోగ్యాస్‌, సీఎన్‌జీ ఉత్పత్తి చేసే ప్లాంట్‌, నీటి పునర్వినియోగం కోసం సీవేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ), 3-4 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. గోవుల మేత కోసం 54 ఎకరాల్లో పచ్చి మేత పంటలు సాగు చేయనున్నారు. సందర్శకుల కోసం సమీపంలోని చెరువును అభివృద్ధి చేసి వాకింగ్‌ ట్రాక్‌లు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ఆట స్థలాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది చివరికి గోశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా విధించుకున్నారు.

Untitled-10 copy.jpg

Updated Date - Mar 29 , 2026 | 06:13 AM