మహిళల దీవెనలే మాకు బలం
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:48 AM
మహిళల దీవెనలే తమ ప్రభుత్వానికి బలమని, మహిళల మద్దతుతోనే 2023లో అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
వారి సాధికారతకు అనేక పథకాలు తె చ్చాం
స్వయం సహాయక సంఘాలకు రూ.16,000 కోట్ల రుణాలిచ్చాం
మహిళా పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మహిళల దీవెనలే తమ ప్రభుత్వానికి బలమని, మహిళల మద్దతుతోనే 2023లో అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార కేంద్రాలుగా వాటిని కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పారామానికి ఆనుకుని ఉన్న రూ.1,000 కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ నిర్వహణకు కేటాయించినట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం ఫిక్కీ చేసిన సూచనలను అమలుచేస్తామని పేర్కొన్నారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శిల్పారామం పక్కనే 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీలో ఎకరం భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఇకపై మూడు నెలలకు ఒకసారి వారితో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 67 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.16 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. మన మహిళలు కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీ సీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోం ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద మహిళలే వెయ్యి బస్సులకు యజమానులుగా మారి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఏటా అవార్డులు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్ సంజయ్‌జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ఎఫ్‌ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజాగార్గ్, ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చైౖర్‌పర్సన్ సీతారెడ్డి గడ్డం తదితరులు పాల్గొన్నారు.