విధ్వంసం నుంచి వికాసం వైపు..
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:03 AM
తెలంగాణను గత పదేళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ..
దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టాం
విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం
సంక్షేమానికి పెద్ద పీట.. అభివృద్ధికి కొత్త దిశ
కృష్ణా, గోదావరి జలాలపై రాజీ ప్రసక్తే లేదు
మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి
రేపట్నుంచి అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో
‘ప్రజావాణి’.. పంద్రాగస్టు వేడుకల్లో సీఎం రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను గత పదేళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ.. తాము అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో ఒక్కొక్కటిగా గాడిలో పెట్టామని, సంక్షేమాన్ని విస్తరించి.. అభివృద్థికి కొత్త దిశను నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలి క వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని.. ఈ పునాదులపైనే ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సంక్షేమాన్ని ఖర్చు చేసిన రూపాయలతో లెక్కించే విధానం తమ ప్రభుత్వానికి లేదని.. పేదల జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన, వారికి ఆరోగ్యకరమైన జీవితం, ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించాలన్న సంకల్పంతో పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటుతోందన్నారు.
అలాగే.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో వ్యవసాయం, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.7 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తామన్నారు. అలాగే.. తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు సహాయం అందించేందుకు రూ.4,709 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మ హిళలకు రూ.60,487 కోట్ల రుణాలు అందించామని, వడ్డీలేని రుణాల కింద రూ.1,900 కోట్ల వడ్డీ రారుతీ విడుదల చేశామని ఆయన తెలిపారు.
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు
సన్నబియ్యం పథకాన్ని విప్లవాత్మక కార్యక్రమంగా సీఎం అభివర్ణించారు. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు భరో సా కల్పిస్తూ 15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని.. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇక.. ఇందిరమ్మ ఇళ్లు అంటే నాలుగు గోడలు, పైకప్పు మాత్రమే కాదని.. పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం అన్నారు. ఈ పథకం తొలి దశలో భాగంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేశామని, హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వృద్థులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు.. ఇలా 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నామని గుర్తుచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు అందించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇక.. సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, రాష్ట్రంలో సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పకడ్బందీగా ని ర్వహించి కులాలవారీగా సామాజిక స్థితిగతుల వివరాలను వెల్లడించామని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించామని, దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని.. బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 42ు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర మొత్తం వ్యయంలో 12.4ు కేటాయించామని వెల్లడించారు. ఇక.. రాష్ట్రంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కేంద్రం ప్రకటించే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ప్రభుత్వం కీలక బాధ్యతగా తీసుకుందని.. ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో 72 వేలకుపైగా నియామకాలు పూర్తి చేశామని ఆయన చెప్పారు.
‘ప్రజావాణి’తో మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం
ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఆగస్టు 17 నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం ప్రకటించారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో ఆన్‌లైన్ ప్రజావాణి పోర్టల్‌ను కూడా ప్రారంభించి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ప్రజలు తమ అర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇండస్ర్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ-2025 ద్వారా పాత పారిశ్రామిక ప్రాంతాలను ప్రణాళికాబద్థంగా పునర్వ్యవస్థీకరించి కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు పరిశ్రమలను కొత్త పారిశ్రామిక ప్రాంతాలకు విస్తరించే చర్యలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. టీజీ-ఐపాస్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, వీటి ద్వారా 78 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని చెప్పారు. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెబుతామన్నారు. నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ-2026 ద్వారా తెలంగాణను ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే.. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని సీఎం తెలిపారు. 2025-26లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయని చెప్పారు. రెండున్నరేళ్ల ప్రజాపాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్ తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.