ఏడాదిన్నరలో కృష్ణా జలాలు
ABN , Publish Date - May 09 , 2026 | 05:32 AM
‘‘పెద్ద కుర్చీయే ఉంది. ఏ పని కావాలన్నా చేసుకోవచ్చు. రెండేళ్లలో కొడంగల్ నియోజకవర్గాన్ని బంగారు తునకలా.. దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రెండు నెలల్లో వికారాబాద్-కృష్ణా రైల్వే లైను
టేకుల్‌కోడ్ వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం
లగచర్ల పార్కుకు పెద్ద పెద్ద పరిశ్రమలు
‘కొడంగల్’ను బంగారు తునక చేసుకుందాం
నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్
3 ఆలయాల పునరుద్ధరణ, 430 పడకల ఆస్పత్రి
నిర్మాణ పనులకు మంత్రులతో కలిసి భూమిపూజ
వికారాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘పెద్ద కుర్చీయే ఉంది. ఏ పని కావాలన్నా చేసుకోవచ్చు. రెండేళ్లలో కొడంగల్ నియోజకవర్గాన్ని బంగారు తునకలా.. దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేసి కృష్ణా జలాలను కొడంగల్‌కు తీసుకు వస్తామని చెప్పారు. ఈ పథకం పనులు వేగవంతం చేసేందుకు భూసేకరణ బాధ్యతను మంత్రి శ్రీహరికి అప్పగిస్తే నెల రోజుల్లోనే 98 శాతం పూర్తి చే శారన్నారు. ఎత్తిపోతల పథకానికి ఇక ఎలాంటి అడ్డంకులు లేవని, ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తామని, కొడంగల్ భూములు కృష్ణా జలాలతో తడవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కొడంగల్‌లో రూ.110 కోట్లతో శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శుక్రవారం భూమి పూజ చేశారు. దౌల్తాబాద్‌లో రూ.2.16 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గిలో రూ.2 కోట్లతో వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణం, హకీంపేట్‌లో రూ.255 కోట్లతో నిర్మించనున్న 430 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులకు ఆయన అక్కడే భూమి పూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘కొడంగల్ నుంచి అనేక మంది వలసలు పోయారు. ఇది రాష్ట్రంలోనే ఎత్తయిన ప్రాంతం. నీళ్లు వచ్చే అవకాశం లేదు. కందులు తప్ప వడ్లు పండించే పరిస్థితి లేదు.
ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టుకోలేని అమాయకత్వం కొడంగల్ ప్రజలది. ఇప్పుడు దేశంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని ఎవరైనా చూడాలనుకుంటే కొడంగల్‌కు వెళ్లి రావాలనిపించేలా.. ఇతరులు అసూయ పడేలా అభివృద్ధి చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు. వికారాబాద్ రైల్వే లైన్ ప్రక్రియ 90 శాతం పూర్తయిందని, మరో రెండు నెలల్లో రైల్వే లైన్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని చెప్పారు. కొడంగల్ ప్రాంతంలో సున్నపు రాయి నిక్షేపాలు అధికంగా ఉన్నాయని, ఆరు నెలల్లో టేకుల్‌కోడ్ వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కాబోతోందని, తద్వారా ఎంతో మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. రెండేళ్లలో దేశంలోని పెద్ద, పెద్ద పరిశ్రమలు లగచర్ల మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు రానున్నాయని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కోస్గి వరకు 330 ఫీట్ల రహదారి నిర్మాణం జరగనుందని చెప్పారు. కొడంగల్ ప్రాంతం ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతోందని, లగచర్ల వద్ద 220 ఎకరాలను కేటాయిస్తున్నామని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ వంటి విద్యా సంస్థలు కొడంగల్‌లో ఏర్పాటవుతున్నాయని, ఉన్నత చదువులకు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు కొడంగల్‌కు వచ్చేలా చేస్తున్నామని చెప్పారు. అన్ని అభివృద్ధి పనులను 2027 డిసెంబరుకు పూర్తి చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు.
తిరుపతి సంప్రదాయమే కొడంగల్‌లోనూ...
కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలకు కూడా పేదల తిరుపతిగా పేరుగాంచిందని గుర్తు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగం కావడం తన జన్మలో మళ్లీ రాని అవకాశమని, ఈ దేవాలయం పేరు ప్రతిష్ఠలను జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి పునర్నిర్మాణం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. తిరుపతిలో ఏ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారో అదే సంప్రదాయం ప్రకారం కొడంగల్ దేవాలయంలో పూజలు కొనసాగాలని స్పష్టం చేశారు. కొడంగల్ అంటే ఒకవైపు గుడి, మరోవైపు గడి అని, రెండూ ఏకమై నందనవనంగా పాడిపంటలతో విలసిల్లేలా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రిగా నిలబడ్డానని, అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.
గ్రూపులు, గుంపులు పక్కనబెట్టండి
సర్పంచులు ఏ పార్టీ నుంచి గెలిచినా గ్రామాల్లో మాత్రం అభివృద్ధి పనులు చేసుకోవాలని, ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత అంతా అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. 2034 వరకు గ్రూపులు, గుంపులను పక్కనబెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ‘‘రాజకీయాలను పక్కన పెట్టండి. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం. చిన్న చిన్న సమస్యలున్నా పట్టించుకోవద్దు. రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ఉంటే ఎన్ని వందల కోట్లయినా తెచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది’’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.