పర్యాటక కేంద్రాలుగా తారామతి, దుర్గం చెరువు
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:17 AM
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
వందల ఏళ్ల పురానాపూల్ సందర్శనకు ఏర్పాట్లు
వికారాబాద్ వీరభద్రస్వామికి యాదగిరిగుట్ట తరహాలో ప్రత్యేక కమిటీ
పర్యాటక శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పర్యాటక శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీ తీరంలో ఉన్న తారామతి బారాదరి ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు. మంజీర, దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లను ఆధునికీకరించాలని చెప్పారు. టూరిజం హబ్ డెవల్‌పమెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వికారాబాద్‌లోని వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాదగిరి గుట్ట తరహాలో వీరభద్రస్వామి ఆలయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యావరణహిత పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ ‘క్యూర్’ పరిధిలోని అటవీ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి ‘ఎకో టూరిజం’ అభివృద్ధి చేయాలన్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలోని మరిన్ని ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్భన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. పాతబస్తీలోని పురానాపూల్ వంతెనను ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే అక్కడి ట్రాఫిక్‌ను మళ్లించి అక్కడ పర్యాటకులు సందర్శించేలా అవకాశం కల్పించాలని చెప్పారు. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ సమ్మిట్‌పైఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని, శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.