Share News

ఆర్నెల్లకో నోటిఫికేషన్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:59 AM

రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు.

ఆర్నెల్లకో నోటిఫికేషన్‌

  • నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధం కావాలి.. బీఆర్‌ఎస్‌ నేతల మాయలో పడొద్దు

  • ఇందిరమ్మ ఇండ్లున్న గ్రామాల్లోనే మేం ఓట్లడుగుతాం

  • డబుల్‌ ఇండ్లున్న గ్రామాల్లోనే బీఆర్‌ఎస్‌ అడగాలి

  • బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దొబ్బుకతిన్నారు

  • అక్కాచెల్లెళ్లకు ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిస్తా

  • ప్రజలపై బీఆర్‌ఎస్‌ చేతబడులు చేయించడమేంటి?

  • బీఆర్‌ఎస్‌, బీజేపీ.. ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులు

  • రేషన్‌కార్డు ప్లాస్టిక్‌ కాగితం కాదు.. ప్రజల ఆత్మగౌరవం

  • అప్పులేని రైతులు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు

  • రాహుల్‌గాంధీ రాముడైతే.. జగ్గారెడ్డి హనుమంతుడు

  • స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

  • సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాల ఆవిష్కరణ

సంగారెడ్డి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఇకపై ప్రతి ఆరు నెలలకూ ఒక ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, తాను మాట ఇస్తే మట్టిలో కలిసే వరకూ నిలబడతానని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయం కోసం, అధికారం కోసం దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువత వారి మాయలో పడకుండా పరీక్షలకు ప్రిపేర్‌ కావాలని సూచించారు. శనివారం సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘‘రేషన్‌కార్డు కేవలం కాగితం కాదు. ఇది ప్రజల ఆకలి తీర్చే ఆత్మగౌరవ కార్డు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన’’ అని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఏనాడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాయా? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదని, నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు. గత పదేళ్లలో వారు ఇచ్చిన దొడ్డుబియ్యం పశువులకు, ఫ్యాక్టరీలకే పనికొచ్చాయని, ఆ బియ్యంతో ఎన్నో స్కాములు చేశారని ఆరోపించారు.


కానీ, తమ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతో పేదవాళ్లు కడుపు నిండా తింటున్నారని తెలిపారు. ‘‘బతుకమ్మ చీరల మీద కమీషన్లు దొబ్బుకుతిన్నారే తప్ప.. ఆడబిడ్డలకు మంచి చీరలు ఇవ్వలేదు. మీ బతుకు చెడ’’ అంటూ బీఆర్‌ఎ్‌సపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఇచ్చిన చీరలు పొలం గట్లపై పిట్టలు వాలకుండా కట్టడానికే పనికొచ్చాయన్నారు. కానీ, తమ ప్రభుత్వం వచ్చాక పాలపిట్ట రంగు చీరలు అందించి మహిళల ఆత్మగౌరవం పెంచామని చెప్పారు. ఈసారి చిలకపచ్చ రంగు చీరలను అక్కాచెల్లెళ్లకు పంపిస్తానని ప్రకటించారు.


ఆ గ్రామాల్లోనే మేం ఓట్లడుగుతాం..

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన గ్రామాల్లోనే తాము ఓట్లు అడుగుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ కూడా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించిన గ్రామాల్లోనే ఓట్లు అడగాలని సవాల్‌ విసిరారు. ఎన్నో మాటలు చెప్పి నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు డబ్బాల్లాగే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణలో రుణం లేని రైతులు ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి రూ.90 వేల కోట్ల నిధులను వారి ఖాతాలకు బదిలీ చేశామని చెప్పారు. రైతుల కోసమే 1లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని, ఎన్ని లక్షల మందికైనా పింఛన్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ రాష్ట్రం బాగుపడొద్దని, ఇక్కడ వర్షాలు కురవొద్దని, కరువు రావాలని కోరుతూ చేతబడి చేయిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ‘చిన్నాచితక పనులనే సోషల్‌ మీడియాలో తిప్పుకొనే మీరు.. శివమొగ్గ ఆలయంలో చేసిన పూజలను ఎందుకు రహస్యంగా ఉంచారో చెప్పాలి’ అని సీఎం డిమాండ్‌ చేశారు. నిజాలు చెబితే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు ఎన్నిపూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనే ఉందని, ఎల్‌నినో ఉన్నప్పటికీ ఎల్లంపల్లి నిండుకుండలా మారిందని అన్నారు. దేవుడి ఆశీర్వాదంతోపాటు ప్రజల ఆశీర్వదం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉండాలని కోరారు.


జగ్గారెడ్డి హనుమంతుడు..

రాహుల్‌గాంధీ రాముడైతే.. జగ్గారెడ్డి హనుమంతుడు అని సీఎం రేవంత్‌ అన్నారు. ఆయనకు ఏం చేయాలో రాహుల్‌గాంధీకి తెలుసునని చెప్పారు. రూ.వెయ్యి కోట్లు పెట్టినా ఇలాంటి నాయకుడు దొరకడన్నారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తమతోపాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉండేవారని, సంగారెడ్డికి ఎంతో మేలు జరిగేదని పేర్కొన్నారు. ఆయన గెలవకపోవడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమన్నారు. ఎన్నికల్లో ఓడినా కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారని చెప్పారు. 10 మంది మహిళలకు వేదికపై కొత్త స్మార్ట్‌ రేషన్‌కార్డులను సీఎం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐబీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. కాగా, బహిరంగసభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్‌షెట్కార్‌, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, నవీన్‌యాదవ్‌, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 06:01 AM