వాళ్లు అఘోరా పూజలు చేసినా.. దేవుడు మా దిక్కే!
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:39 AM
‘‘ఎల్‌నినో వచ్చింది.. మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుందని అన్నారు. కానీ, ఎల్‌నినో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. హైదరాబాద్‌కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు.
ఎల్‌నినో వచ్చినా రాష్ట్రంలో ఎల్లంపల్లి నిండింది
సమస్య లేకుండా దేవుడు వానలు కురిపించాడు
డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ ఊరించారు.. కానీ ఇవ్వలేదు
మేం ఇప్పుడు కోట్ల విలువజేసే భూముల్లో ఇళ్లు కడుతున్నాం
ఎక్కడ పనిచేసే వాళ్లకి అక్కడే ఇంటిని కట్టి ఇస్తున్నాం
అబద్ధాల సంఘాలు పెట్టుకుని కొందరి ప్రచారం
ఆందోళన చెందొద్దు.. 22ఏ సమస్యలను పరిష్కరిస్తాం
ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎల్‌నినో వచ్చింది.. మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుందని అన్నారు. కానీ, ఎల్‌నినో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. హైదరాబాద్‌కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి ‘కరువు రావాలె.. జనాలు చచ్చిపోవాలే.. ఈ ప్రభుత్వం బద్నాం కావాలి’ అని అఘోరా పూజలు చేశారు. అట్లాంటి దుర్మార్గులు ఎంత ఘోరంగా అఘోరా పూజలు చేసినా దేవుడు వాళ్ల దిక్కు లేడు. దేవుడు మన దిక్కే ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను గొప్ప తెలివి కల వాడినని, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని చెప్పనని, కానీ, పది మందికి మేలు చేయాలన్న ఆలోచన తనకు ఉందని చెప్పారు. తనను దేవుడు కాపాడడానికి అది ఒక్కటీ చాలునని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబుతో కలిసి గురువారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. ‘‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా కేసీఆర్ పరిస్థితి ఉంది. ‘‘పదేళ్లు అధికారంలో ఉండి పక్క రాష్ట్రాలకు పోయి చేతబడి చేస్తారా? ఆ చేతబడి తిరగబడితే ఏమైతదో తెలుసు.
బుద్ధి సక్కగా లేకపోతే చేతబడి కూడా తిరగబడతది. ఫార్మ్ హౌస్‌లో నుంచి బయటికి వెళ్లకుండా అయితది.తిరగబడి మిమ్మల్నే అష్ట దిగ్బంధం చేస్తది’’ అని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా నేరుగా చూశారా అని ప్రశ్నించారు. తాను మీ మధ్యనే తిరుగుతున్నానని చెప్పారు. మంచి మనసుతో మంచి ఆలోచనతో వచ్చానని, అభివృద్ధిలో తనకు రాజకీయాలు లేవని తెలిపారు. అందరూ సహకరిస్తే అద్భుతమైన తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఒడిదుడుకులను అధిగమించి.. ఆర్థికంగా నిలదొక్కుకొని.. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి తనకు శక్తిని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, మిత్తి కడుతూనే ఇన్ని మంచి పనులు చేస్తున్నానని తెలిపారు. ‘‘వయసు, ఓపిక ఉంది. మీ కోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 12-18 గంటలు పనిచేసే శక్తి దేవుడు ఇచ్చాడు. గతంలో ఉన్న పథకాలు కొనసాగిస్తూ అదనంగా సంక్షేమాన్ని అందిస్తున్నాం’’ అని వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500లకు సిలిండర్, 70 వేల ఉద్యోగాలు.. దీపం పథకం కింద 400 రూపాయలకు స్టవ్ సిలిండర్ తదితర పథకాలను వివరించారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ అంటూ గత ప్రభుత్వం గుండు సున్నా పెట్టిందని, తాము రూ.65 వేల కోట్లకు బ్యాంకు లింకేజీ ఇచ్చి రూ.2500 కోట్లు మీ తరపున బ్యాంకు వడ్డీ చెల్లించామని తెలిపారు. కానీ, కొంతమంది సోషల్ మీడియాలో అబద్ధాల సంఘాలు పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు
ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు, కాలనీలు కాంగ్రెస్ ఇచ్చిందని, ఇయ్యాల ఆ సంప్రదాయమే దెబ్బతిన్నదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘‘అహ నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంటూ పేదోళ్లందరికీ ఊరిచ్చి ఊరిచ్చి చెప్పారు. ఇందిరమ్మ ఇల్లంటే డబ్బా ఇల్లన్నారు. అవి వద్దే వద్దు అన్నారు. మేం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? ఎవరికన్నా వచ్చినాయా?’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సభికులను అడిగారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొల్లూరు, మేడ్చల్ అవతల కడితే పోయేది ఎన్నడు.. ఉండేది ఎన్నడు.. వాపస్ వచ్చేది ఎన్నడని ప్రశ్నించారు. పనులు చేసుకొని పోయే సరికి మధ్య రాత్రి అయితదని, పిల్లలు పండుకొంటారని విమర్శించారు. ‘‘ఇయ్యాల మా శ్రీనివాస్ రెడ్డి ఆలోచన చేసిండు. నాతోని పంచాయితీ పెట్టుకున్నాడు. ఇది చాలా విలువైన భూమి అని, ఇలా అయితే ఎలా అంటే.. మనం మాట ఇచ్చినం.. లక్ష ఇళ్లు కట్టాల్సిందేనని పట్టుబట్టారు. కూకట్‌పల్లిలో పాన్ డబ్బా అంతా జగ కావాలంటే 20 లక్షలు కావాలి. అట్లాంటిది.. 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇయ్యాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక్కడ పని చేసేటోళ్లకి ఇక్కడే ఇవ్వాలని, ఎక్కడ ఉండేటోళ్లకి అక్కడే ఇళ్లు కట్టాలని స్పష్టం చేశాడు. ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు’’ అంటూ ఆయన్ను, హౌసింగ్ శాఖ అధికారులను సీఎం అభినందించారు. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అణాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5లక్షలు ఇస్తుందని, మిగతా ఐదారు లక్షలు లబ్ధిదారులు ఇస్తారని, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయలని ఆదేశాలిచ్చానని తెలిపారు.
22ఏలో పెడితే ఒక్క ఇంచు పోదు
‘‘మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణంతో 22ఏలో పడి ఉంటే ఒక్క ఇంచు కూడా ఏడికీ పోదు. నేను మీకు జమానత్ ఇస్తున్నా. అధికారులతో మాట్లాడి మీ భూమి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకునేలా అన్ని ఆదేశాలు ఇస్తా’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక సర్వే నంబర్లో 500 ఎకరాలుంటే.. కోర్టు ఆదేశాలు ఇస్తే.. ఆ సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితా (22ఏ)లో పెడుతున్నారని చెప్పారు. అందుకే ఆయా భూములకు బై నంబర్లు ఇస్తామని, కేసు, కోర్టు ఆదేశాలు ఉన్న విస్తీర్ణాన్నే పక్కన పెడతామని, మిగతా భూముల్లో రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూస్తామని వివరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసానిచ్చారు.
కూకట్‌పల్లిని ప్రత్యేకంగా చూడాలని సీఎం ఆదేశాలు
ఆనాడు కొడంగల్‌లో ఓడితే తనని మల్కాజిగిరి ఎంపీగా గెలిచేందుకు కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు సంపూర్ణంగా అండగా నిలబడ్డారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. వాళ్ల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీకు ఏమి కావాలన్నా కూకట్‌పల్లి ప్రజలు పనులు చేయించుకోండి. మా మంత్రులందరికీ వేదిక మీద నుంచే ఆదేశాలిస్తున్నా. కూకట్‌పల్లిని ప్రత్యేకంగా చూడాలి’’ అని వ్యాఖ్యానించారు.