ఫీజు డబ్బులు రెడీ
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:58 AM
విద్యార్థుల ఫీజులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో ఉంచుతున్నామని తెలిపారు.
బ్యాంకు ఖాతాలో అడ్వాన్సుగా ఉంచుతున్నాం
ఈ విద్యాసంవత్సరానికి రూ.250 కోట్లు ఉంచాం
ఒలింపిక్స్ పతకం తెస్తే ప్రభుత్వ ఉద్యోగమిస్తాం
రాష్ట్రంలో కులగణన చేసి కేంద్రానికి సవాలు విసిరాం
విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు పనిచేస్తా
మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణలో సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో ఉంచుతున్నామని తెలిపారు. కాలేజీలో అడ్మిషన్ పొందిన వెంటనే ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని, నెల రోజుల్లోవిద్యార్థి ఖాతాలో ఫీజు జమ చేస్తామని ప్రకటించారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడగకుండానే మీ ఖాతాలో వేస్తాం. ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ.2400 కోట్లను అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో పెట్టి.. విద్యార్థుల ఖాతాల్లోకి బదిలీ చేస్తాం. ఈ విద్యా సంవత్సరానికి రూ.250 కోట్లు అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాలో పెట్టాం. మీరు చింతించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వబోమనే అవకాశం ఇవ్వం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులనుద్దేశించి చెప్పారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న నెక్లెస్ రోడ్డుకు, హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ఓవైపు అంబేడ్కర్, మరోవైపు జ్యోతిబా పూలే, చౌరస్తాలో ఇందిరాగాంధీ, ఆ పక్కన పీవీ నర్సింహారావు విగ్రహాలను పెట్టింది వారి వర్థంతులు, జయంతులు జరుపుకోవడానికి మాత్రమే కాదన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఈ గొప్ప వ్యక్తుల విగ్రహాలను చూసి.. వారు చేసిన త్యాగాలను, వారి స్ఫూర్తిని పొందాలని, ఆ స్ఫూర్తితో విద్యలో రాణిస్తూ సామాజిక చైతన్యంతో వ్యవహరించాలని సూచించారు.
చదువుతోనే సమాజంలో గుర్తింపు..
సమాజంలో అంటరానితనం, ఆకలి కేకలు, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు ఉండి.. చదువు అనేదే అందని సమయంలో మహిళలకు చదువు అందించిన మహానీయుడు పూలే అని సీఎం రేవంత్ కొనియాడారు. 136 ఏళ్ల క్రితం మరణించినా.. సమాజంలో వారు తీసుకొచ్చిన సామాజిక విప్లవాన్ని గుర్తు చేసుకుంటున్నామని, ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో అదే విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. చదువు ఒక్కటే తలరాతను మారుస్తుందని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టి సమాజంలో గుర్తింపునిస్తుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు వేర్వేరుగా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకోవడం కాదని, అందరూ కలిసికట్టుగా ఉన్నత వర్గాలతో సహా ఒకే దగ్గర చదువుకోవడం, కూర్చోని తినడం, కలిసి జీవించడం ద్వారా కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని తెలిపారు. అందుకోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను విప్లవాత్మకంగా తీసుకొచ్చామని చెప్పారు. ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేదని, కానీ.. ప్రస్తుతం సర్టిఫికెట్ ఉంటే సరిపోవడం లేదని అన్నారు. చదువులో నాణ్యత ఉందా? నైపుణ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు నైపుణ్యాలు నేర్పాలని తాను స్పష్టంగా చెప్పానని తెలిపారు. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే అమెరికాలో ఉద్యోగం వచ్చేదని, ఇంటికి డాలర్లు పంపేవారని, కానీ.. ఏఐ వచ్చిన తర్వాత ఐటీ నిపుణుల ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చదువులో పోటీ పెరిగిందని, లక్షలాది మంది పోటీ పరీక్షలు రాస్తున్నారని గుర్తు చేశారు. ‘‘మనం పుట్టని కాలంలో ఫస్ట్ క్లాస్ వస్తే జిల్లా గుర్తు పట్టేది. ప్రస్తుతం ఫస్ట్ క్లాసే కాదు.. నూటికి నూరు మార్కులు వచ్చేటోళ్లు 90 శాతం మంది ఉంటున్నారు. కొందరు చదువు కంటే కూడా సాంకేతిక నైపుణ్యంలో, క్రీడల్లో రాణిస్తుంటారు. క్రీడల్లో రాణిస్తే నగదు బహుమతితోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలి. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తాను. మీరు క్రీడల్లో రాణించండి.. రాష్ట్ర, జాతీయ స్థాయితోపాటు ఒలింపిక్స్ పతకాలు తీసుకురండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను’’ అని సీఎం అన్నారు.
మాదిగ ఉపకులాల వర్గీకరణ చేశాం
మందకృష్ణ మాదిగ ఎస్సీ కులాల వర్గీకరణ కోసం 40 ఏళ్లు కొట్లాడారని సీఎం రేవంత్ అన్నారు. ఎవరూ అమలు చేయని దానిని తాము ధైర్యంగా ఉపకులాల వర్గీకరణ చేశామని తెలిపారు. గ్రూప్-1 అధికారులుగా దాదాపు 40 మందికి వర్గీకరణ ద్వారానే నియామక పత్రాలు అందించామని తెలిపారు. బలహీన వర్గాల గణన చేపట్టాలన్న ఆలోచనను వందేళ్లలో ఎవరూ చేయలేదని, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కులగణన చేసిందని చెప్పారు. బీసీల లెక్కలు తేల్చి కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరామన్నారు. దీనిపై కోర్టులో పిటిషన్లు వేసినవారు, లిటిగేషన్లు పెట్టినవారు, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ మంత్రులుగా చేసినోళ్లు కులగణనలో పాల్గొనలేదని విమర్శించారు. లెక్కలకు వస్తే వారు ఎంతమంది ఉన్నారో, వారికి ఎన్ని పదవులు ఇచ్చారో తెలుస్తుందనే రాలేదని ఆరోపించారు. వారు అసెంబ్లీలో వ్యతిరేకించినా చట్టపరంగా కమిషన్‌ను నియమించి అన్ని నిబంధనలు అమలు చేసి బీసీల లెక్కలు తేల్చిన మొదటి రాష్ట్రం, చివరి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గొప్పలు చెప్పే ప్రధానమంత్రి కూడా గుజరాత్‌లో చేయలేదన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని, ప్రజా ప్రతినిధులై చట్ట సభలలకు రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత తనదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వి.హనుమంతరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.