Share News

రాబడి పెంచుకునేదెలా..?

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:34 AM

రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చర్చ జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక విభాగాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ....

రాబడి పెంచుకునేదెలా..?

  • సీఎం రేవంత్‌తో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ భేటీ

  • ఆదాయ పెంపు మార్గాలపై చర్చ

  • ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి

  • ఆర్థిక సలహాదారు సూచనలతో తుది నిర్ణయం తీసుకోవాలి

  • అధికారులకు స్పష్టం చేసిన సీఎం

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చర్చ జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక విభాగాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, సీఎంవో అధికారులు, రిజిస్ట్రేషన్‌, విద్యుత్తు శాఖ, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆదాయం పెంచుకోవడానికి తీసుకున్న చర్యలను అరవింద్‌ సుబ్రమణియన్‌ ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే మార్కెట్‌ విలువల పెంపుపై ప్రతిపాదనలను సిద్ధం చేసిన రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వస్తాయనే చర్చ నేపథ్యంలో.. మార్కెట్‌ విలువల సవరణ మీద చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అరవింద్‌ సుబ్రమణియన్‌ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఆర్థిక సలహాదారు ఇచ్చిన సూచనల ప్రకారం ఆదాయం పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌ ఆదేశించినట్లు సమాచారం. విద్యుత్తు శాఖలో సంస్కరణల ద్వారా రాబడి పెంచుకోవడానికి ఉన్న అవకాశాలపై, డిస్కమ్‌ల పరపతి పెంపు, టారిఫ్‌ రాయితీ వంటి అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఎలాంటి సంస్కరణల ద్వారా డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. తాజాగా రైతుల కోసం ప్రత్యేకంగా ఒక డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున.. ఆ డిస్కమ్‌ మనుగడపైనా చర్చించినట్లు తెలిసింది. జీఎస్టీ రాబడిపైనా సుదీర్ఘంగా చర్చించారు.

Updated Date - Mar 17 , 2026 | 04:34 AM