Share News

మాట ఇచ్చారు.. పట్టా అందించారు

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:22 AM

ఓ నిరుపేద మహిళ కష్టాన్ని చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. ఆయన ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి జిల్లా అధికారులకు...

మాట ఇచ్చారు.. పట్టా అందించారు

  • పేదింటి మహిళ కష్టాన్ని చూసి చలించిన సీఎం

  • హామీ ఇచ్చిన మరుసటి రోజే ఇంటి కల సాకారం

  • మంత్రి తుమ్మల ఆదేశంతో ఇల్లు కేటాయింపు

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : ఓ నిరుపేద మహిళ కష్టాన్ని చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. ఆయన ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి జిల్లా అధికారులకు ఇచ్చిన సూచనల మేరకు ఆ నిరుపేద మహిళకు డబుల్‌బెడ్‌ రూం ఇంటిని కేటాయించారు. ఆ వివరాలివీ.. ఖమ్మం నగరంలో 30వ డివిజన్‌కు చెందిన విద్యార్థిని తురక దేవిశ్రీ ప్రసన్న జాతీయ స్థాయి రెడ్‌ రిబ్బన్‌ క్విజ్‌ కాంపిటీషన్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు దేవిశ్రీ ప్రసన్న తన తల్లి లక్ష్మితో కలిసి వెళ్లగా.. ఆ కార్యక్రమంలో గవర్నర్‌ సమక్షంలో ముఖ్యమంత్రి బహుమతిగా రూ.50 వేలు, మెమొంటోను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. దేవిశ్రీ ప్రసన్న తల్లి లక్ష్మిని పలకరిస్తూ.. కుటుంబం పరిస్థితి గురించి అడిగారు. దాంతో తనకు భర్త లేడని, రెక్కల కష్టంతో కుమార్తెను చదివిస్తున్నానని, కనీసం ఇల్లు కూడా లేదని చెప్పడంతో స్పందించిన సీఎం ఆమెకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని లక్ష్మికి సీఎం ఇచ్చిన మాట మేరకు ఇల్లు మంజూరు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దాంతో స్పందించిన అధికారులు శనివారం ఆ మహిళకు ఖమ్మం వైయస్సార్‌ నగర్‌ డబుల్‌ బెడ్‌ ఇళ్ల సముదాయంలోని ఓ ఇంటిని మంజూరు చేయగా.. ఆ పత్రాన్ని 30వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అర్వపల్లి శివ సమక్షంలో కాంగ్రెస్‌ ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌ చౌదరి ఆమెకు అందజేసి ఇంటిని కూడా అప్పగించారు. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

30న సీఎం రేవంత్‌ ఖమ్మం జిల్లా పర్యటన

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో రైతుమేళా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 30న సీఎం రేవంత్‌ సభలో పాల్గొననున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 05:22 AM