CM Revanth Reddy: ఉద్యోగులే వారధులు, సారథులు
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:26 AM
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్‌ఎంపీ డాక్టర్, డిప్యూటీ ఎమ్మార్వో, రిటైర్డ్ టీచర్‌ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించిందని ధ్వజమెత్తారు.
ప్రజాపాలనలో 70 వేల కొలువుల భర్తీ
టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం
స్వప్రయోజనాల కోసమే పనిచేసిన గత పాలకులు
‘కొలువుల పండగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్
1370 మంది గ్రూప్-3 విజేతలకు నియామక పత్రాల అందజేత
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్‌ఎంపీ డాక్టర్, డిప్యూటీ ఎమ్మార్వో, రిటైర్డ్ టీచర్‌ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశామని చెప్పారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్లనే టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించామన్నారు. ఈ చిత్తశుద్ధితో రెండేళ్లలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాలను ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశామని వివరించారు. దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. నియామక పత్రాలు ఇవ్వొద్దని కొందరు కుట్రలు చేసినా కోర్టుల్లో కొట్లాడి మరీ ఖాళీలను భర్తీ చేశామన్నారు. శుక్రవారం శిల్పాకళా వేదికలో నిర్వహించిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో గ్రూప్-3కి ఎంపికైన 1,370 మందికి సీఎం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సర్కారుకు వారధులు, సారథులు ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తుంది. 25 ప్రభుత్వ శాఖల్లో 1370 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలతో మిమ్మల్ని కలిసి, మీ కళ్లలో ఆనందం చూడాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం’ అని సీఎ చెప్పారు. 10 ఏళ్లలో రెండు సార్లు సీఎం అయిన వ్యక్తులు రాజకీయ, కుటుంబ, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీఆలోచనే చేయలేదన్నారు. గత పాలకులు కుటుంబం, పార్టీ, రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. వాళ్ల ఉద్యోగాలు తొలగిస్తేనే తమకు కొలువులు వస్తాయని నిరుద్యోగ యువత నడుం బిగించినందునే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
విద్యతోనే జీవితాల్లో మార్పు, వెలుగులు
విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, 11 వేల ప్రైవేట్ బడుల్లో 33 లక్షల మంది చదువుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం ఎందుకు తగ్గుతుందో ఆలోచించాలని.. పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలమనే విశ్వాసం తనకుందని తెలిపారు. నైపుణ్యాలు లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేకపోతున్నామని.. నైపుణ్యాభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉందని అన్నారు. నాణ్యమైన విద్యను అందించే అవకాశం ప్రభుత్వం దగ్గర ఉందని.. విద్య ఒక్కటే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకొస్తుందని తెలిపారు.
రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాల్లా మారొద్దు..
ప్రభుత్వోద్యోగులు.. పేదల ముఖాల్లో తమ తల్లిదండ్రులను చూసుకొని సేవలందించాలని సీఎం రేవంత్ సూచించారు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోని ఉద్యోగుల జీతంలో 10-15ు కోత విధించి, వారి తల్లిదండ్రులకు అందజేస్తామన్నారు. పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఓయూలో, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు తెలుసునని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.