పొంగులేటి రాజీనామా చేయాలి
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:28 AM
రాష్ట్రంలో కంచే చేను మేస్తే.. అన్నట్లుగా మంత్రులే అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ..
కొత్వాల్‌గూడ వద్ద మంత్రికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్
మైనింగ్ అనుమతుల్లేకుండానే ఆ కంపెనీ పొంగులేటిది కాదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం
భార్య, కొడుకు దూరపు బంధువులా?
అసెంబ్లీలో హరీశ్‌రావు ధ్వజం
హౌస్ కమిటీ వేయాలని డిమాండ్
స్పీకర్ పోడియం వద్ద బైఠాయింపు
బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రం లూటీ
మంత్రుల దీటైన కౌంటర్లు
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కంచే చేను మేస్తే.. అన్నట్లుగా మంత్రులే అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ.. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని జీవో 111 ప్రాంతంలో ఎలాంటి మైనింగ్, పర్యావరణ అనుమతుల్లేకుండా అక్రమ మైనింగ్ చేస్తోందని ఆరోపించారు. మినరల్ డీలర్ లైసెన్స్, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, కనీసం రిజిస్ర్టేషన్ కూడా లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తెలిపారు. సీనరేజ్ చెల్లించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, విద్యుత్ కనెక్షన్ కూడా తీసుకోలేదని, డీజిల్ జనరేటర్లతోనే భారీ ఎత్తున మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం శాసనసభలో మైనింగ్ పద్దులపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. మంత్రి పొంగులేటిపె తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. విపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టిన ‘హౌస్ కమిటీ’ డిమాండ్, అధికార పక్షం ఇచ్చిన గట్టి కౌంటర్లతో సభ స్తంభించింది. మూసీని ప్రక్షాళన చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లను తొలగిస్తున్నారని, కానీ.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌తో మూసీ నది, గండిపేట, హిమాయత్‌సాగర్ కలుషితం అవుతున్నాయని మైనింగ్ అధికారులు చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. మరోవైపు పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తమ్ముడికి చెందిన స్టోన్‌క్రషర్ యూనిట్‌లో చిన్న తప్పు జరిగిందంటూ రాత్రికి రాత్రే అరెస్టు చేసి నెలరోజులు జైల్లో పెట్టారని గుర్తుచేశారు.
పదేళ్లలో అక్రమ మైనింగ్‌పైనా విచారణ..
హరీశ్‌రావు ఆరోపణలను అధికార పక్షం మూకుమ్మడిగా తిప్పికొట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా విపక్షంపై విరుచుకుపడ్డారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీ తప్పుచేస్తే.. పై అధికారికి ఫిర్యాదు చేయాలని, ఒకే కంపెనీపై సభలో మాట్లాడటం సరైంది కాదని అన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. అక్రమ క్రషర్లపై చర్యలకు ఆదేశించామన్నారు. అయితే క్రిమినల్ కేసులు పెట్టి, జైల్లో పెట్టాలని చట్టం చెబుతోందని హరీశ్ పేర్కొన్నారు. దీంతో వ్యక్తిగతంగా ఒకే కంపెనీ గురించి మాట్లాడటం సరైంది కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పదేళ్లలో ఇసుక దందా, మైనింగ్‌లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి వివేక్ అన్నారు. రాఽఘవ కంపెనీలో మంత్రి పొంగులేటి పేరు లేదని, ఆయనపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని శ్రీధర్‌బాబు అన్నారు. హరీశ్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా లేచి హరీశ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. స్పీకర్ కూడా ఇవే సూచనలు చేసినా హరీశ్‌రావు వినకుండా ‘హౌస్ కమిటీ’ వేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. వెల్‌లో కూర్చొని నినాదాలు చేశారు. చివరికి హరీశ్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయినా.. బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన కొనసాగించడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇసుక రవాణా, క్వారీ వివాదాల నేపథ్యంలో దళితులపై దాడులు, పోలీసుల హింస పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇసుక మాఫియా వల్ల దళితుల ప్రాణాలు పోతున్నా.. అప్పట్లో హౌస్ కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. గంగుల కమలాకర్ మైనింగ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముందుగా బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ లూటీపై సమాధానం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రేయింబవళ్లు ఇసుక అక్రమ రవాణా సాగించారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వెల్‌లోకి వచ్చే సంప్రదాయం ఎప్పుడైనా చూశారా? చప్పట్లు కొట్టడమేంటి? అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘గత పదేళ్లు మైనింగ్ మాఫియాను పెంచి పోషించిన చరిత్ర మీది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు’అని అన్నారు. కాగా, రాఘవ కనస్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గమని హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బందువులెలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ అనేది పొంగులేటి తండ్రి పేరు అని తెలిపారు.