Share News

గ్లోబరీనా.. కేటీఆర్‌ బినామీ!

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:50 AM

వివాదాస్పద గ్లోబరీనా కంపెనీ కేటీఆర్‌ బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ కంపెనీతో కేటీఆర్‌కు నిజంగా సంబంధమే లేకుంటే దానిపైవిచారణ కోరుతూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని డిమాండ్‌ చేశారు.

గ్లోబరీనా.. కేటీఆర్‌ బినామీ!

  • దాని అడుగుజాడల్లోనే నీట్‌ స్కాం.. సీబీఎ్‌సఈ ఫలితాల్లోనూ ఘోర వైఫల్యం

  • తెలంగాణలో 27 మంది ఇంటర్‌ పిల్లల్ని పొట్టనబెట్టుకుంది

  • ఆ సంస్థతో కేటీఆర్‌కు సంబంధమే లేకుంటే దాని అవకతవకలపై విచారణ కోరాలి

  • ప్రధాన్‌ రాజీనామా ఎందుకు కోరవు?.. బ్యారేజీల్లో అవినీతితో హరీశ్‌ పదవి ఊడింది

  • నాకు 2 ఓట్లు ఉంటే పోలీసు కేసు పెట్టండి.. తప్పుడు ఫిర్యాదైతే పెట్టినోళ్లే జైలుకు

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద గ్లోబరీనా కంపెనీ కేటీఆర్‌ బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ కంపెనీతో కేటీఆర్‌కు నిజంగా సంబంధమే లేకుంటే దానిపైవిచారణ కోరుతూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి సదరు కంపెనీ అక్రమ లావాదేవీలన్నీ బయటికి తీస్తామన్నారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా అడ్వయిజరీ కమిటీ హాల్లో గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరీనా సంస్థకు ఇంటర్‌ పరీక్షా పత్రాలు దిద్దే కాంట్రాక్టును అక్రమంగా కట్టబెట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆ కంపెనీ తప్పిదాల వల్ల 2019లో 27 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అప్పుడే ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, క్రిమినల్‌ కేసు కట్టి లోపల వేయాల్సి ఉందని చెప్పారు. కేసీఆర్‌ అలా చేయకుండా వదిలేయడం వల్ల ఆ కంపెనీ కో ఎంప్ట్‌గా పేరు మార్చుకుని సీబీఎస్సీ ప్రశ్నాపత్రాలు దిద్దే కాంట్రాక్టు పొందిందని అన్నారు. సీబీఎస్సీ పరీక్షల నిర్వహణలోనూ ఇవే తప్పులు జరిగాయన్నారు. ఈ అవకతవకల ఆదర్శంగానే నీట్‌ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థతో కేటీఆర్‌కు ఏ సంబంధం లేకుంటే ఆ కంపెనీ అవకతవకలపై విచారణ కోరుతూ సీసీఎ్‌సలో ఫిర్యాదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి జన్వాడ ఫామ్‌ భూములు ఏ రాజుల నుంచి కేటీఆర్‌కు వచ్చాయి? గ్లోబరీనా కంపెనీలో ఉన్నది ఏ రాజులు? ఆ రాజుల వెనుక ఉన్న యువరాజు? ఎవరు అన్న వివరాలు, లావాదేవీలు అన్నీ బయటికి వస్తాయని చెప్పారు. ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. గ్లోబరీనా వ్యవహారంపైన కేటీఆర్‌ క్షమాపణలు చెప్పి, అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి, ఆ తర్వాత మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ తనపై వేసిన పరువు నష్టం దావా విషయంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ, పరువు ఉన్నవాళ్లు వేస్తే దాన్ని పరువు నష్టం దావా అంటారన్నారు. నీట్‌ ప్రశ్నాపత్రాల లీక్‌పై దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా కేటీఆర్‌ ఇప్పుడు ధర్నా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పిల్లలు రోడ్లపైన దెబ్బలు తింటుంటే వెంటనే ఎందుకు రోడ్లపైకి రాలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్‌ రాజీనామాను బీఆర్‌ఎస్‌ ఎందుకు కోరట్లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్‌నే మూసేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెరిచిన ధర్నా చౌకే ఇప్పుడు కేటీఆర్‌ ధర్నా చేయడానికి దిక్కయిందని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 7, 2023 తర్వాత తమ ప్రభుత్వం చేసిన నియామకాలపై వివరాలు ఇవ్వాలంటూ అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రశ్నిస్తే పేర్లు సహా అన్ని వివరాలూ ఇస్తామన్నారు. పదేళ్లలో గ్రూప్‌ 1 నియామకాలు చేపట్టలేక పోయారని, తాను కోర్టు కేసులు క్లియర్‌ చేసి ఒక్క ఏడాదిలోనే గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి చేశానని చెప్పారు.


కేసీఆర్‌ అందుకే హరీశ్‌ పదవి పీకాడు

కాళేశ్వరంలో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణంలో టెక్నాలజీ మ్యానిపులేషన్‌ చేసి కాంట్రాక్టర్ల నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకున్నందుకే హరీశ్‌రావు నుంచి ఇరిగేషన్‌ శాఖను కేసీఆర్‌ ఊడబీకాడని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ శాఖకు హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడే మూడు బ్యారేజీలు కట్టారని గుర్తు చేశారు. ఆ బ్యారేజీలను ఏ టెక్నాలజీలో కట్టాలని వ్యాప్కోస్‌ ప్లాన్‌ ఇచ్చింది, ఏ టెక్నాలజీతో కట్టారని ఈ సందర్భంగా రేవంత్‌ప్రశ్నించారు. కాళేశ్వరం గురించి మాట్లాడే ముందు.. తన నుంచి కేసీఆర్‌ ఇరిగేషన్‌ శాఖను ఎందుకు ఊడబెరికారో హరీశ్‌రావు సమాధానం చెప్పాలన్నారు. హరీశ్‌ చెప్పినట్లుగా పారే నీళ్ల నుంచి నీటిని ఎత్తే అవకాశం ఉంటే బ్యారేజీలు ఎందుకు కట్టినట్లని ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో గేట్లు దించి నీళ్లు ఆపితే మొత్తం కుప్పకూలుతుందని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందన్నారు. పరీక్షలు జరిపి చర్యలు తీసుకున్న తర్వాతే పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశించిందని తెలిపారు. కన్నెపల్లి పంప్‌ హౌస్‌ ద్వారా నీళ్లు ఎత్తాలంటే మేడిగడ్డ గేట్లు దించి కనీసంగా 5 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కన్నెపల్లి పంపుల ద్వారా అన్నారంలో నీళ్లు ఎత్తి పోసి.. అక్కడి నుంచి లక్ష్మీ పంప్‌ హౌస్‌ ద్వారా సుందిళ్లకు నీళ్లు ఎత్తి పోసి.. అక్కడి నుంచి సరస్వతి పంప్‌ హౌస్‌ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తి పోయాల్సి ఉంటుందని వివరించారు. అన్నారం నుంచి లక్ష్మీ పంప్‌ హౌస్‌ ద్వారా సుందిళ్లకు నీళ్లు ఎత్తి పోయాలంటే అన్నారం బరాజ్‌ గేట్లు దించి 16 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టాల్సిందేనని చెప్పారు. సుందిళ్ల నుంచి సరస్వతీ పంప్‌ హౌస్‌ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తాలన్నా సుందిళ్ల గేట్లు మూయాల్సిందే నన్నారు. మూడు బరాజ్‌ల గేట్లు మూసి, 3 పంప్‌ హౌస్‌లు ఒకే సారి నడిపిస్తే గానీ ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయలేమని చెప్పారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరపాలని సీబీఐకి అప్పగిస్తే కేంద్రంతో మేనేజ్‌ చేసుకున్న ధైర్యంతో హరీశ్‌ ఉల్టా దాడి మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు.


కుటుంబంలో ఒక్కరైనా రక్తం ఇచ్చారా?

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని కొవ్వుపట్టిన కుటుంబంలో ఒక్కరన్నా మొన్నటి బీఆర్‌ఎస్‌ రక్తదానం కార్యక్రమంలో రక్తం ఇచ్చారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఉద్యమ సమయంలో పిల్లల ప్రాణాలు తీసుకున్నరు. అధికారంలోకి వచ్చాక ప్రజల సొమ్ము దోచారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజల రక్తం అమ్ముకున్నరు. తీసిన రక్తం గాంధీకో, ఉస్మానియాకో ఇస్తే పేద ప్రజలకన్నా ఉపయోగపడేది కదా?’’ అన్నారు. 2025 గ్లోబల్‌ సమ్మిట్‌ జరిగినప్పుడు రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ తన కార్యాలయం ఎక్కడ పెట్టుకుంటుందో ఆ లేన్‌కు పేరు సదరు కంపెనీది పెడతామని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ట్రంప్‌ కంపెనీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కాన్సులేట్‌ దారికి ఆయన పేరు పెట్టామని వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల వరకు తన అంచనాలు, బీఆర్‌ఎస్‌ అంచనాలూ చూడాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెప్పానని గుర్తు చేశారు. ఎంపీ సీట్లు బీఆర్‌ఎస్‌కు గుండు సున్న అని చెప్పానని, సర్పంచ్‌ ఎన్నికల్లో టూ థర్డ్‌ సీట్లు, మున్సిపల్‌ ఎన్నికల్లో డిస్టింక్షన్‌ సాధిస్తామని చెప్పానని, అదే జరిగిందని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ అవయవదానంతో లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేటల్లోనూ బీజేపీకి మెజార్టీ వచ్చిందని ప్రస్తావించారు.


నాకు 2 ఓట్లు ఉంటే.. పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వండి

తనకు రెండు ఓట్లు ఉన్నట్లయితే పోలీసు కంప్లయింట్‌ ఇవ్వాలని, దానిపై విచారణ చేయిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తప్పుడు కేసు అయితే పెట్టినవాడిని లోపల వేయిస్తానన్నారు. జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకుని తన ఓటును తన ఊరి నుంచి కొడంగల్‌కు మార్పించుకున్నానని ముఖ్యమంత్రి వివరించారు. కొడంగల్‌ నియోజకవర్గం మొదట కర్ణాటకలో ఉండేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిందని చెప్పారు. ఎస్‌ఐఆర్‌లో ఓటు పోతే సర్వమూ పోయినట్లేనని, ఓట్లు కాపాడేందుకే ఆగస్టు 3 ఎన్యుమరేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ గాంధీభవన్‌కు రావద్దని నేతలకు చెప్పానన్నారు. ఎన్యుమరేషన్‌ 70 శాతం మాత్రమే పూర్తయిందని, కార్యకర్తలు పూనుకుంటే తప్ప ఇది ముందుకు పోదని వ్యాఖ్యానించారు. ఓటర్ల గురించి బీఎల్‌వోల కన్నా బీఎల్‌ఏలకే ఎక్కువ తెలుస్తుందని అన్నారు. భూమి, ఇల్లు లేనివారికి గుర్తింపును ఇచ్చేది ఓటరు కార్డు, ఆధార్‌, రేషన్‌ కార్డులేనని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ ఓట్లు కొట్టేస్తున్నారని, ఈ విషయంలో బీజేపీకి కుల గురువు కేసీఆరేనని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సోమేష్‌ కుమార్‌ ఉన్నప్పుడు 28 లక్షల మంది ఆంధ్రా ఓటర్ల ఓట్లు తీసేయించారని ఆరోపించారు. మర్రి శశిథర్‌రెడ్డి కోర్టుకు వెళితే 15 లక్షల ఓట్ల పునరుద్దరణ జరిగిందని వివరించారు. సోమేష్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేసే వరకూ వస్తే కేసీఆర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ శాఖకు బదిలీ చేశారని తెలిపారు. కాంగ్రెస్‌కు దన్నుగా ఉన్న దళిత, మైనారిటీ ఓటర్లని, ఏదో ఒక నెపంతో తీసివేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. దాన్ని ఎదుర్కొనడానికి కాంగ్రెస్‌ నేతలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇంటికి టోకెన్‌ అడ్వాన్స్‌ రూ.10 వేలుగా నిర్ణయించడంపై ప్రతిపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి స్పందిస్తూ, దళారులకు అమ్ముకున్నరు కాబట్టే ఆ పార్టీని అధికారం నుంచి వెళ్లగొట్టారని అన్నారు. పేదలకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ దాన్ని ఆపాలని చూస్తోందని ఆరోపించారు.

Updated Date - Jul 24 , 2026 | 05:54 AM