Share News

దశాబ్దాల కల నెరవేర్చారు

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:38 AM

దశాబ్దాల తమ కోరికను నెరవేర్చారంటూ ఉద్యోగ, పింఛనర్ల సంఘాల నేతలు సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పింఛనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, రూ.1,056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల....

దశాబ్దాల కల నెరవేర్చారు

  • ప్రమాద బీమా, నగదు రహిత వైద్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌కు

  • ఉద్యోగ, పింఛనర్ల సంఘాల నేతల కృతజ్ఞతలు

  • ప్రభుత్వ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని హర్షం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 : దశాబ్దాల తమ కోరికను నెరవేర్చారంటూ ఉద్యోగ, పింఛనర్ల సంఘాల నేతలు సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పింఛనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, రూ.1,056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల ఆరోగ్య పథకానికి క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం సీఎంని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య, బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలను పొందేలా ఉద్యోగులకు అవకాశం లభించడం నిజంగా వరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఉద్యోగులు సీఎంకు తెలిపారు. ఉద్యోగుల ఐకాస ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐకాస చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్‌ అధికారులు, కార్మిక, ఉపాధ్యాయులు, పింఛనుదారుల ఐకాస భాగస్వామ్యం చేసిన నిరంతర కృషి వల్లనే ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులు, వైద్య విభాగం 010 పద్దు కింద వేతనాలు తీసుకునే ప్రక్రియ సాధ్యమైందని చెప్పారు. ఉద్యోగులకు ఆరో గ్య కార్డులు, వైద్య విధాన పరిషత్‌ పేరును డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ క్యాబినెట్‌ తీసుకు న్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్‌ పేరు మార్చడం వల్ల అక్కడ పనిచేస్తున్న 12,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తులోనూ భాగస్వామ్య ఉద్యోగ సంఘాలన్నీ ఇదే ఐక్యతతో ప్రధాన డిమాండ్లు అయిన పీఆర్సీ, పెండింగ్‌ బిల్లులు రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచేలా ఒత్తిడి తెద్దామని చెప్పారు. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతం ఆధ్వర్యంలో ట్రెసా బృందం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు.


తహసీల్దార్లకు పదోన్నతులు, అవుట్‌సోర్సింగ్‌ ఆపరేటర్ల కొనసాగింపు, ఉద్యోగుల వేతన సవరణపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో లచ్చిరెడ్డి(డిప్యూటీ కలెక్టర్ల సంఘం), చావా రవి(యూటీఎఫ్‌), కె. వెంకటేశ్వర్లు, (టీఎన్‌జీవో), ఉపేందర్‌ రెడ్డి(టీజీవో), సదానంద గౌడ్‌(ఎస్టీయూ), దామోదర్‌ రెడ్డి, ఉమాదేవి(పెన్షనర్లు), శ్రీనివాస్‌ రెడ్డి (సచివాలయం), ఖాదర్‌(నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం), ఎస్‌.రాములు, రామిరెడ్డి, దశరథ్‌, ఉపేందర్‌రావు, సుగంధిని తదితరులు ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్‌ కార్డులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి సీఎంకు కృతఙ్ఞతలు తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్‌ రెడ్డి సుంకరి భిక్షంగౌడ్‌లతో కలిసి ఎమ్మెల్సీ మంగళవారం సీఎంను సచివాలయంలో కలిశారు. గురుకుల, మోడల్‌, కేజీబీవీ స్కూళ్ల టీచర్లకూ హెల్త్‌ కార్డులు వర్తింపజేయాలని కోరారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత తప్పనిసరిగా ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇతర రాష్ట్రాల మాదిరిగా టెట్‌ అర్హత మార్కులు తగ్గించాలని కోరారు.

Updated Date - Feb 25 , 2026 | 01:38 AM