Share News

అట్రాసిటీ బాధితులకు గ్రీన్‌ చానల్‌ ద్వారా సాయం

ABN , Publish Date - Sep 23 , 2026 | 06:21 AM

సీఎం రేవంత్‌హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమగ్ర అభివృద్ధి, ఆత్మగౌరవం, పౌరహక్కుల పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు

అట్రాసిటీ బాధితులకు  గ్రీన్‌ చానల్‌ ద్వారా సాయం
CM Revanth Reddy

  • బడ్జెట్‌ కేటాయింపులతో ముడిపెట్టకుండా నిధులు

  • అట్రాసిటీ, నిఘా, పర్యవేక్షణ కమిటీ సమీక్షలో సీఎం

  • బడ్జెట్‌ కేటాయింపులతో ముడిపెట్టకుండా నిధులు.. సకాలంలో పరిహారం, పునరావాసానికి చర్యలు

  • ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు

    నిరంతరం ప్రభుత్వం కృషి

  • బడ్జెట్‌లో జనాభా దామాషా

  • ప్రకారం నిధుల కేటాయింపు

  • అణిచివేతపై రాజకీయాలకు

    అతీతంగా పోరాడుదాం

కేసులు ఎక్కువగా నమోదవుతున్న 73

గ్రామాలపై నిఘా పెట్టాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమగ్ర అభివృద్ధి, ఆత్మగౌరవం, పౌరహక్కుల పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కేవలం పథకాల కేటాయింపులతోనే సరిపెట్టకుండా నాణ్యమైన విద్య, స్థిరమైన ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సామాజిక సమానత్వం సిద్ధించి సమాజంలో గుణాత్మక మార్పు వస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై అణచివేతను, వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు రాజకీయ విబేధాలను పక్కనబెట్టి అందరూ ఒకే వేదికపైకి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం కింద బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని బడ్జెట్‌ కేటాయింపులతో ముడిపెట్టకుండా వెంటనే విడుదల చేసేందుకు ‘గ్రీన్‌ చానల్‌’ ద్వారా నిధులు కేటాయించాలని, సకాలంలో ఆర్థిక సహాయం, పునరావాసం దక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం-1989 అమలు తీరుతెన్నులపై ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు. కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్‌ కోర్టుల పనితీరుతోపాటు చట్టంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన చివరిసారిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ సమీక్ష జరగడం, దళిత, గిరిజన వర్గాల భద్రత, సంక్షేమం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న ఉన్నతమైన ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.

ఐదేళ్లలో అట్రాసిటీ కేసులు తగ్గుముఖం..

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని అధికారులు సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ.. కొన్ని నిర్దిష్ట జిల్లాల్లో, ప్రధానంగా 73 గ్రామాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా నమోదవుతోందని ముఖ్యమంత్రికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. దీంతో.. ఆయా గ్రామాలపై పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశాలు కూడా క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు. ఇటీవల జరిగిన షాబాద్‌ హత్యల కేసు, తుక్కుగూడ నర్సుపై హత్యాచారం కేసులను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించి.. బాధిత కుటుంబాలకు వేగవంతంగా న్యాయం చేయాలన్నారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ సొంత బిడ్డల్లా ఆదరించిందని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గతంలో పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు పట్టాలు అందించారని, ఆ స్ఫూర్తితోనే ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారమే ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణంలో విప్లవాత్మక మార్పుగా రాష్ట్రంలో 16 శాతం ఉన్న ఎస్సీ జనాభాకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రికార్డు స్థాయిలో 31 శాతం లబ్ధి చేకూర్చామని తెలిపారు.


అదేవిధంగా 10 శాతం ఉన్న ఎస్టీ జనాభాకు 17 శాతం ఇళ్లను కేటాయించామన్నారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు 3.48కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, తద్వా రా దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు.సంక్షేమ హాస్టళ్లకు నిరంతర నిధులు..

విద్య ఒక్కటే మానవ జీవితాలను పూర్తిగా మార్చగలదని, సామాజిక అసమానతలకు, అణిచివేత రుగ్మతలకు చదువే శాశ్వత పరిష్కారమని సీఎం రేవంత్‌ అన్నారు. అట్టడుగు వర్గాల పిల్లలను ఉన్నతవిద్య వైపు నడిపించేందుకు రాష్ట్రంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న27.5 లక్షల మంది విద్యార్థులకు నిత్యం నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. పిల్లలను కేవలం చదువుకే పరిమితంచేయకుండా.. క్రీడలు, ఇతర రంగాల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా ప్రతి నెలా మొదటి వారంలోనే కాస్మొటిక్‌, మెస్‌ చార్జీలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్య పదవులు ఇచ్చామని, స్పీకర్‌, ఉపముఖ్యమంత్రి, ముగు ్గరు మంత్రులు, ప్రభుత్వ విప్‌లుగా అవకాశం ఇచ్చామని గుర్తుచేశారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించం: మంత్రి అడ్లూరి

దళితులు, గిరిజనుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం-1989 అమలు తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం అనంతరం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అడ్లూరి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల శాసనసభలో స్పీకర్‌, ఆయన తల్లికి సంబంధించిన అంశంలో చోటుచేసుకున్న పరిణామాలు, దళిత సంఘాల నిరసన అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలు ఆ ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత అమానుషమని అన్నారు. ఈ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు స్పందించకపోవడం విచారకరమన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 06:21 AM