CM Revanth Reddy: ఇకపై కొత్త సిలబస్
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:53 AM
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతమున్న సిలబ్‌సలో మార్పులు జరగనున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.
ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు మార్పు.. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతమున్న సిలబ్‌సలో మార్పులు జరగనున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగినట్టు ఒకటి నుంచి పదో తరగతి వరకు సిలబ్‌సను మార్చాలని, ఇందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి విద్యా శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలమని ‘అక్షయ పాత్ర’ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు 2 ఎకరాల స్థలం కేటాయించడం లేదా 99 ఏళ్లపాటు లీజు తీసుకునే అంశంపై జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావుకు సీఎం రేవంత్ సూచించారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణం చేపట్టిన 23 నూతన పాఠశాలల భవనాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలన్నారు. ఈ సందర్భంగా, బాచుపల్లి పాఠశాలకు అరెకరం స్థలం మాత్రమే ఉండడంపై సీఎం ఆరా తీశారు. ఎక్కడైనా పాఠశాలలకు కనీసం ఎకరన్నర స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో పూర్తయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ (సమీకృత గురుకులాలు) స్కూల్స్‌ను ఎక్కువగా బాలికలకు కేటాయించాలని నిర్దేశించారు. బాలికలకు కేటాయించిన నియోజకవర్గాల్లో మరో విడతలో బాలురకు కేటాయించాలన్నారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలికలు, బాలుర కోసం సమీకృత గురుకులాలను ఒక్కొక్కటి చొప్పున నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు.
వీటిలో ఏర్పాటు చేయబోయే సోలార్ కిచెన్ నిర్మాణాలను ‘పీఎం-కుసుమ్’లో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. సమీకృత గురుకులాల బిల్లులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పనులను వేగవంతం చేయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రక్రియను టాటా టెక్నాలజీ్‌సతో చేసుకున్న ఒప్పందం మేరకు త్వరగా అమలయ్యేలా చూడాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన ఉండాలన్నారు.
మీ విద్యా విధానం భేష్
సీఎం రేవంత్‌తో హిమాచల్‌ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్
తెలంగాణలో విద్యా విధానం బాగుందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్ఠానికి సీఎం రేవంత్ విజన్ భేష్ అంటూ హిమాచల్‌ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ కొనియాడారు. సచివాలయంలో ఆయన సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల ఏర్పాటు గురించి సీఎం ఆయనకు వివరించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒకేచోట మినీ యూనివర్సిటీ తరహాలో ఉండి చదువుకునేందుకు వీలుగా ఒక్కో గురుకులాన్ని 200 కోట్లతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. జాతీయ విద్యా విధానం తరహాలో త్వరలోనే తెలంగాణ విద్యా విధానాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించామని వివరించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ-ప్రైమరీ విద్య అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ-ప్రైమరీ చిన్నారులను బడులకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే యోచన కూడా చేస్తున్నట్టు తెలిపారు. దాంతో, ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు సంబంధించిన సమగ్ర నివేదికను తమకు అందించాలని రోహిత్ విజ్ఞప్తి చేశారు.