CM Revanth Reddy instructed: బీఆర్‌ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:39 AM
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ సునాయాసంగా గెలుస్తామని మంత్రివర్గ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సులువే..అయినా మనం అప్రమత్తంగా ఉండాలి
కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకువెళ్లాల్సి వస్తోంది.. జాగ్రత్తగా ఉండండి
మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ సునాయాసంగా గెలుస్తామని మంత్రివర్గ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది. అయినా సరే అప్రమత్తంగానే ఉండాలని, ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తోందని.. ఎన్నికల వ్యవహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మిగతా 15 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఒక్కో మంత్రి ఒక్కో లోక్‌సభ స్థానం బాధ్యతలను సీఎం అప్పగించారు. 14 మంది మంత్రులకు 14 లోక్‌సభ సెగ్మెంట్లుపోగా.. మరో సెగ్మెంట్ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి అప్పగించారు. తమకు అప్పగించిన లోక్‌సభ స్థానాల పరిధిలో మున్సిపాలిటీల్లో స్థానిక నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేసే పని వెంటనే మొదలుపెట్టాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం. మంత్రి ఉత్తమ్‌కు నిజామాబాద్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మల్కాజిగిరి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు కరీంనగర్.. ఎవరెవరు ఏయే సెగ్మెంట్ల బాధ్యతలు తీసుకోవాలనే జాబితాను కేబినెట్ భేటీలో అందజేసినట్టు తెలిసింది. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ఖరారు వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించిన నేపథ్యంలో.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ మధ్య 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు సమాచారం. ఇక దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. మూడో దశ 2011 నుంచీ పెండింగ్‌లో ఉందని, గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపిందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రస్తావించినట్టు తెలిసింది. తొలి రెండు దశలతో పెద్దగా ప్రయోజనం కలగలేదని.. మూడో దశ అంచనాలను సవరించి, వెంటనే పనులు చేపట్టాలని కోరినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. మొత్తంగా కేబినెట్ ఎజెండాలోని 15 అంశాలు, అప్పటికప్పుడు భేటీలో ప్రస్తావనకు వచ్చిన ఏడు అంశాలు కలిపి.. మొత్తం 22 అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది.