CM Revanth Reddy: కమ్యూనిస్టుల పోరాటాలే..కాంగ్రెస్ సర్కారు చట్టాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:37 AM
ప్రజా సమస్యలపై కమ్యూనిస్టుల పోరాటాల ఆధారంగాచట్టాలు చేసి అమలుచేస్తున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కమ్యూనిస్టుల సహకారంతోనే కాంగ్రెస్ సర్కారు వచ్చింది
సీపీఐ శతాబ్ది ఉత్సవ ముగింపు సభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఖమ్మం/ ఖమ్మం కార్పొరేషన్/ కూసుమంచి/ ఖమ్మం రూరల్/ ఖమ్మం అర్బన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై కమ్యూనిస్టుల పోరాటాల ఆధారంగాచట్టాలు చేసి అమలుచేస్తున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, వందేళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)లు కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిపై పోరాడాయని, ఆ స్ఫూర్తితోనే ప్రధాని మోదీని గద్దెదించి.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని విమర్శించారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో ప్రారంభమైన సీపీఐ.. ఈ వందేళ్లలో ఎన్నో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు సాగించిందని ప్రశంసించారు. ఖమ్మం గడ్డపై నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల సభ స్ఫూర్తితో రాబోయే వందేళ్లలో మరిన్ని ప్రజా పోరాటాలు చేయాలని సూచించారు.
కమ్యూనిస్టుల వల్లే భూ సంస్కరణలు
కమ్యూనిస్టుల ‘దున్నేవాడికేభూమి’ అనే నినాదంతోనే దేశంలో భూసంస్కరణలు వచ్చాయని సీఎం అన్నారు. గడీల్లో వెట్టిచారికీ చేసిన పేదలకు కనీస వేతనాలు ఉండాలన్న కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతన చట్టం తెచ్చిందని తెలిపారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర దక్కాలని కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటాల ఫలితంగానే కనీస మద్దతు ధరలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదని ప్రశంసించారు.
బీజేపీతో దేశానికి ముప్పు
నాడు బ్రిటీషర్లతో దేశానికి ఎంత ప్రమాదం ఉండేదో, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంతే ప్రమాదం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ పాలకులు బ్రిటీష్ వారి ఆలోచనా విధానంతో పనిచేస్తూ.. ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారని విమర్శించారు. అదానీలు, అంబానీలకు కూలీలు దొరకటం లేద న్న కారణంతో.. పేదల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. రైతులు, కూలీలు మళ్లీ గ్రామాలను వదిలి వలస వెళ్లే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం తెస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చి, పేదల హక్కులను కొల్లగొట్టడానికి గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలని చూస్తే.. దానిని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసికట్టుగా అడ్డుకున్నాయని తెలిపారు. ఇప్పుడు ఎస్‌ఐఆర్ ద్వారా పేదల ఓట్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల ఓటు హక్కును తొలగిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ‘మీరు (కమ్యూనిస్టులు), మేం వేరు కాదు. ప్రజల కోసం కలిసి పనిచేద్దాం. మాది పేదల రాజ్యం, పేదల ప్రభుత్వం. కమ్యూనిస్టులుగా మీరు ఇచ్చిన నినాదంతోనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. ఈ అధికారంలో మీ శ్రమ, సహకారం కూడా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం’ అని సీఎం పిలుపునిచ్చారు.
సీఎం సభకు టీడీపీ అభిమానులు
ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఆదివారం నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ జెండాలతో బైక్ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జై రేవంత్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. వారిని చూసి సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఉత్సాహంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరును స్మరిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన బీఆర్‌ఎ్‌సను గొయ్యితీసి పాతిపెట్టాలని, అప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు.
ప్రజా విప్లవకారుడు రేవంత్‌రెడ్డి: కూనంనేని
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రజా విప్లవకారుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొనియాడారు. సీఎం హోదాలో ఉన్నా.. బేషజాలు లేకుండా ఆయన అందరితో కలిసిపోతారని ప్రశంసించారు. రేవంత్‌రెడ్డి తనకు తమ్ముడిలాంటివారని తెలిపారు. కమ్యూనిస్టుల పని అయిపోందనుకన్న వారు.. ఈ సభను చూసైనా వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలు కమ్యూనిస్టు పార్టీ వైపు నడిచే పరిస్థితి రాబోతుందని పేర్కొన్నారు. కాగా, సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు క్యూబా, పాలస్తీనా, వెనెజువెలా, వియత్నాం, ఉత్తరకొరియా, నేపాల్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.