Share News

CM Revant Reviews Employee Issues: అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెడతా..

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:37 AM

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెడతానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌...

CM Revant Reviews Employee Issues: అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెడతా..

  • ఉద్యోగుల జేఏసీ నేతలతో సీఎం రేవంత్‌

  • సీఎంను కలిసిన రెవెన్యూ ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్ర జ్యోతి): ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెడతానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. టీజీవో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బి.శ్యామ్‌ను సీఎంకు పరిచయం చేయగా.. ఆయన్ను అభినందించారన్నారు. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరు తేవాలని సీఎం సూచించినట్లు ఆ సంఘం అధ్యక్షుడు వి.విక్టర్‌, కార్యదర్శి చంద్రకళ ఓ ప్రకటనలో తెలిపారు. ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్‌ నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు సీఎంను కలిశారు. అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ సంఘం గౌరవ అధ్యక్షుడు లచ్చిరెడ్డి నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు కూడా సీఎంను కలిశారు.

జైళ్ల శాఖ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం

జైళ్లశాఖ రూపొందించిన నూతన సంవత్సరం-2026 క్యాలెండర్‌, డైరీని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు సీఎంను గురువారం ఆయన నివాసంలో కలిశారు. జైళ్ల శాఖకు సంబంధించిన వివిధ అంశాలతో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌ను ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు.

Updated Date - Jan 02 , 2026 | 04:37 AM