పౌష్టికాహార ‘తొలి ముద్ద’
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:22 AM
రాష్ట్రంలోని చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను తొలగిస్తున్నాం
అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవంలో సీఎం
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీల్లో చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘తొలి ముద్ద’ పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉంది కానీ.. అందరికీ పౌష్టికాహారం అందడం లేదని తెలిపారు. అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారం అందిస్తున్నామని.. ఇప్పుడు తొలి ముద్ద పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల బాగుంటుందని అన్నారు. తొలి ముద్ద పథకాన్ని సరిగా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపైనే ఉందని అన్నారు. చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని, వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని.. వారి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా ముందుగా అంగన్వాడీల సమస్యలనే పరిష్కరిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు.. సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు సీఎం మొబైల్ ఫోన్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, శిశు సంక్షేమ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి ముద్ద పథకం ద్వారా అంగన్వాడీ చిన్నారులకు రోజూ ఉదయం ఉప్మా, కిచిడీని అందించనున్నారు.