Share News

CM Revanth Reddy: చిరస్థాయిగా మేడారం!

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:34 AM

మేడారం మహా జాతర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా గద్దెను ఆధునికీకరించామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy: చిరస్థాయిగా మేడారం!

  • చరిత్రలో నిలిచిపోయేలా ఆధునికీకరించాం

  • రూ.101 కోట్లతో జాతరకు కొత్త రూపు

  • పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌

  • మనవడితో కలిసి సీఎం తులాభారం

  • కుటుంబ సమేతంగా మొక్కుల సమర్పణ

వరంగల్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడారం మహా జాతర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా గద్దెను ఆధునికీకరించామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. తాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కిందన్నారు. మేడారం మహా జాతరకు సంబంధించి రూ.101 కోట్లతో ఆధునికీకరించిన పలు అభివృద్ధి పనుల పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. వీటిలో గద్దెల ఆధునికీకరణతోపాటు ప్రాకారం, ఫ్లోరింగ్‌, అంతర్గత డ్రైనేజీ, క్రౌడ్‌ లైటింగ్‌, వాచ్‌ టవర్‌, తొమ్మిది స్వాగత ద్వారాలు, హరిత హోటల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు సీసీ రోడ్డు, గద్దెల నుంచి జంపన్నవాగు వెళ్లే రహదారి విస్తరణ, రోడ్డు నిర్మాణం, కూడళ్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, వన దేవతలకు మొక్కులు చెల్లించారు. సీఎం రేవంత్‌ రెడ్డి తన సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిషా రెడ్డి, అల్లుడు శరత్‌, మనవడు రేయాన్ష్‌తో కలిసి పాల్గొనగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, వివేక్‌, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు సీఎం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా పూజారులు, అతిఽథులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్ర, ఆదివాసీల ఆచారాలు తెలిసేలా అద్భుతంగా ఆధునికీకరించడం జరిగింది. ఇందులో భాగస్వాములైన మంత్రులు, అధికారులు, పూజారులందరికీ అభినందనలు’’అని వ్యాఖ్యానించారు.

సీఎం తులాభారం

సమ్మక్క, సారలమ్మలకు సీఎం రేవంత్‌ రెడ్డి బంగారం(బెల్లం)తో తులాభారం వేశారు. మనవడు రేయాన్ష్‌తో కలిసి తులాభారం వేయగా 68 కిలోల బంగారాన్ని తల్లులకు సమర్పించారు. అనంతరం వన దేవతలకు సీఎం కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌, కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు చీర, సారెతోపాటు వనదేవతల ప్రసాదాలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు కాక సారయ్య, సిద్దబోయిన అరుణ్‌, భోజారావు, కొక్కెర రమేశ్‌, రఘుపతిరావు, సిద్దబోయిన స్వామి బహూకరించి, ఘనంగా సన్మానించారు. సీఎం రేవంత్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం 6.25 గంటలకు మేడారం గద్దెల వద్దకు చేరుకున్నారు. తులాభారం, వన దేవతలకు మొక్కులు చెల్లించిన తర్వాత కొద్దిసేపు పూజారులు, మంత్రులతో గద్దెల ప్రాంగణంలో మాట్లాడారు. అనంతరం రూ.101 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

Updated Date - Jan 20 , 2026 | 02:34 AM