బండి భగీరథ్ కేసులో సంజయ్ పేరు వాడొద్దు!
ABN , Publish Date - May 16 , 2026 | 05:13 AM
బండి భగీరథ్ కేసులో ఆయన తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరును వాడొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
కేంద్ర మంత్రి పేరును ఇక ఎక్కడా ఉపయోగించొద్దు
సోషల్‌మీడియాలో ఇప్పటికే ఆయనపై వచ్చిన కథనాలను 26లోపు తొలగించాలి
సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): బండి భగీరథ్ కేసులో ఆయన తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరును వాడొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన పేరుతో ఇప్పటి వరకు సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లలో ఉన్న వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు.. బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి సంజయ్ పేరును వాడొద్దంటూ గ్యాగ్ ఆర్డర్‌ను జారీ చేసింది. ఇకపై భగీరథ్ కేసులో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటి వరకు సోషల్ మీడియా, ఇతరత్రా డిజిటల్ వేదికల్లో బండి సంజయ్ పేరిట వచ్చిన కథనాలను ఈ నెల 26లోపు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించకపోతే ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి తరఫు న్యాయవాది కరుణసాగర్ తెలిపారు.