సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అంతర్రాష్ట్ర గంజాయి దందా
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:20 AM
కానిస్టేబుల్ ముసుగులో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) కానిస్టేబుల్ దందాకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్....
గంజాయి రవాణా చేస్తుండగా హైదరాబాద్‌లో పట్టివేత
రూ.79 లక్షల విలువైన 158 కిలోల గంజాయి సీజ్
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట, జూన్ 3(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్ ముసుగులో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) కానిస్టేబుల్ దందాకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. తన ఐడీ కార్డు చూపెట్టి గంజాయిని గుట్టుగా పోలీసు చెక్‌పోస్టులు దాటించే ఆ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను మంగళవారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అతని వద్ద రూ.79 లక్షల విలువైన 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంకు చెందిన పనగూడు శివకృష్ణ(39) 2009లో సీఐఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం కేరళంలోని త్రివేండ్రం జిల్లాలో నివాసముంటున్న శివకృష్ణ .. డిప్యుటేషన్‌పై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్)లోనూ పనిచేశాడు. అయితే, తనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు గంజాయి అక్రమ రవాణా వ్యాపారంలోకి దిగాడు. ఒడిసాలో ఓ సాగుదారుడి నుంచి భారీ మొత్తంలో గంజాయి సేకరించి దానిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని డ్రగ్ పెడ్లర్లకు చేర్చేవాడు. ఈ క్రమంలో పోలీసు చెక్‌పోస్టులు, టోల్‌గేట్ల వద్ద తనిఖీలు జరుగుతుంటే తన సీఐఎస్ఎఫ్‌కానిస్టేబుల్ ఐడీ కార్డును చూపించి వాహనాలను దాటించేవాడు. అలా తనిఖీల నుంచి తప్పించుకుంటూ పోలీసుల కళ్లు కప్పి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న శివకృష్ణను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట పోలీసులు 2025లో అరెస్టు చేశారు. దీంతో శివకృష్ణ అక్రమ దందా వ్యవహారం బయటపడగా.. సీఐఎస్ఎఫ్ అధికారులు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నాటి కేసులో ఖమ్మం జైలులో శిక్ష అనుభవించిన శివకృష్ణ.. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా గంజాయి దందా కొనసాగించాడు. ఈ క్రమంలో శివకృష్ణ ఒడిసా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు సిటీ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత శివకృష్ణను ఎస్‌ఆర్‌నగర్ పరిధిలో అరెస్టు చేశారు. అతని వద్ద 158 కిలోల ఎండు గంజాయి, ఓ కారు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.