Cotton Purchases: దూకుడు పెంచిన సీఐడీ
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:31 AM
తప్పుడు టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) పత్రాలతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కే బురిడీ కొట్టించి రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడిన వ్యవసాయ...
పత్తి కొనుగోళ్లలో సీసీఐకి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల టోకరా
రూ.కోట్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో రంగంలోకి సీఐడీ
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తప్పుడు టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) పత్రాలతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కే బురిడీ కొట్టించి రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడిన వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల అధికారుల తీరుపై విచారణలో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు.. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల అధికారుల నుంచే తమ దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సేకరించాలని తలపెట్టారు. 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ సాగిన పత్తి కొనుగోళ్ల సమగ్ర సమాచారమివ్వాలని ఆ రెండు శాఖలకు సీఐడీ లేఖ రాసింది. రైతులు, వ్యాపారులకు సంబంధించి 22 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్‌లో వేర్వేరు సమాచారం అందించాలని తెలిపింది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయానికి ముందుగా రైతులు తమ మండలంలోని వ్యవసాయాధికారుల వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలి. సీజన్ వారీగా పత్తి సాగు విస్తీర్ణం, దిగుబడితోపాటు రైతు తన ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్ వివరాలను నమోదు చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు తెచ్చిన రైతుల వద్ద మాత్రమే అధికారులు పత్తి కొనుగోలు చేస్తారు. అధిక సంఖ్యలో పత్తి రైతులు ఉండటంతో మార్కెటింగ్ సెక్రటరీలకు సంబంధిత రైతులకు టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) పత్రాలను జారీ చేసే అధికారాన్ని మార్కెటింగ్‌శాఖ కట్టబెట్టింది. దీని అదునుగా అధికారులతో కలిసి దళారులు.. ఏ సమాచారమివ్వకుండానే టీఆర్ నంబర్ తీసుకుని తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేసి.. సీసీఐకి ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు గడించారు. రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్లు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో సీఐడీ రంగంలోకి దిగింది.