కూల్‌డ్రింక్‌లకు రైతుల నుంచి 200 వసూలు!
ABN , Publish Date - May 11 , 2026 | 06:19 AM
ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు అదనపు కలెక్టర్ వెంకారెడ్డిని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై అదనపు కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు
చౌటుప్పల్ టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు అదనపు కలెక్టర్ వెంకారెడ్డిని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. చౌటుప్పల్ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. హమాలీ చార్జీలు క్వింటాకు రెండు రూపాయలు అదనంగా తీసుకోవడంతో పాటు కూల్‌డ్రింక్ పేరిట రూ. 200 వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. గన్నీ బ్యాగులు ఇచ్చేందుకు డబ్బులు అడుగుతున్నారని, నాలుగు రోజుల క్రితం తూకం వేసిన ధాన్యాన్ని ఇంకా తరలించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కాగా చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. 100 మంది రైతులకు చెందినధాన్యం రాశుల కిందికి నీరు చేరి తడిసిపోయాయి.