మనకు క్యాన్సర్ రాదనే నిర్లక్ష్యం వీడండి
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:47 AM
మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని శరీరం ఎప్పటికప్పుడు చెబుతుందని, శరీరం చెప్పే మాటను వింటే అనేక అనారోగ్యాల నుంచి బయటపడవచ్చునని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు.
తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభం
ఆడపిల్లలు హెచ్‌పీవీ వ్యాక్సిన్లు వేయించుకోవాలి
కిమ్స్‌లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని శరీరం ఎప్పటికప్పుడు చెబుతుందని, శరీరం చెప్పే మాటను వింటే అనేక అనారోగ్యాల నుంచి బయటపడవచ్చునని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. క్యాన్సర్ మనకు రాదనే నిర్లక్ష్యాన్ని వీడాలని, ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. క్యాన్సర్‌లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, కానీ అవగాహన లేక చాలామంది ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాకే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునే తాను కొలన్ (పెద్దపేగు) పరీక్ష చేయించుకుంటే చిన్న కణితులు ఉన్నాయని తేలిందని, వెంటనే అవసరమైన చికిత్స తీసుకున్నానని చెప్పారు. అలాగే, ఏ అలవాట్లు లేని తన మిత్రుడు ఒకరు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారని, కానీ ముందుగా గుర్తించడం వల్ల తిరిగి సాధారణ స్ధితికి వచ్చారని వివరించారు. ఇక, ఆడపిల్లలకు గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్‌లను నివారించడానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని, అమ్మాయిలంతా ఆ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పోలియో, మసూచిపై చేసినట్టుగా పోరాటం చేస్తేనే క్యాన్సర్‌ను నివారించగలమని, క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రచార చిత్రాలలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చిరంజీవి ఈ సందర్భంగా వెల్లడించారు. కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్ భాస్కరరావు మాట్లాడుతూ క్యాన్సర్ బారిన పడి విజయం సాధించిన వారిని సర్వైవర్లు కాదు కాంకరర్స్ అని పిలవాలని కోరారు. దాదాపు 50 రకాల క్యాన్సర్‌లు విటమిన్ డీ, బీ లోపం వల్ల వస్తాయని, రెయిన్‌బో డైట్ అనుసరించడంతో పాటు వ్యాయామాలు చేయడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ బారినపడకుండా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి, ఆంకాలజిస్ట్ నరేంద్రకుమార్ తోట, కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు పాల్గొన్నారు.