ఓపిక నశిస్తే.. జీవన్‌రెడ్డిలా తిరగబడతా
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:30 AM
కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
వనపర్తి ఎమ్మెల్యే డబ్బులతో టికెట్ తెచ్చుకున్నారు
నా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కలిసి రూ.కోట్లు తిన్నారు
సొంత పార్టీపై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు
నేటి నుంచి రాష్ట్రంలో మండల స్థాయి ప్రజావాణి
గోపాల్‌పేట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని.. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ.. తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా మారి తిరగబడతానని హెచ్చరించారు. ఆదివారం వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఎమ్మెల్యే టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. రేవంత్‌రెడ్డికి చెప్పారు. ఆయన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారు. కానీ, పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి నాకు టికెట్ ఇవ్వలేదు’’ అని చిన్నారెడ్డి అన్నారు. వనపర్తిని అవినీతినిమయంగా మార్చారని, తాను అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటే ఎమ్మెల్యే తన వారికే పనులు ఇవ్వాలంటూ వాటిని ఆపుతున్నారని ఆరోపించారు. సీఎం శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ నిర్మాణం, నర్సింగాయిపల్లి వద్ద పీజీ కేంద్రంలో బాలికలకు రూ.9 కోట్లతో వసతిగృహం, బాలురకు రూ.15 కోట్లతో హాస్టల్ నిర్మాణానికి టెండరు పిలిచారని, కానీ, ఆ పనులు జరగడం లేదని తెలిసి తాను స్వయంగా ఆయా శాఖల మంత్రి, అధికారుల వద్దకు వెళ్లి అడిగానని తెలిపారు. అయితే.. పనులకు ఎమ్మెల్యేనే అడ్డు పడ్డారని, ఆ కాంట్రాక్టర్ తన మనిషి కాడంటూ కాంట్రాక్టు రద్దు చేయించారని వారు చెప్పారన్నారు. గోపాల్‌పేట మండలంలో వ్యవసాయ మార్కెట్‌ను ఎమ్మెల్యే అనుచరుడి కోసం ఎక్కడో అడవిలో నిర్మించారని ఆరోపించారు.
బుద్ధారం చెరువు రైట్ కెనాలే 2018 ఎన్నికల్లో తన కొంప ముంచిందన్నారు. ‘‘మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఒక ఎక్స్‌కవేటర్, నాలుగు టిప్పర్లు పెట్టుకొని.. ఊరూరా తిరుగుతూ చెరువులకు కాల్వలు తవ్వి.. నీరు ఇచ్చేసరికి జనం చిన్నారెడ్డిని మరిచిపోయారు. ఇద్దరూ కలిసి కోట్టు కోట్లు తిని, ప్రజల నోట్లో డబ్బులు పెట్టి నా రాజకీయంపై దెబ్బ కొట్టారు’’ అని చిన్నారెడ్డి వాపోయారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు వారి ఇళ్లకు కూడా వెళ్లారని, కానీ.. ప్రజా ప్రతినిధులపై చర్యలకు సంకోచిస్తున్నారని చెప్పారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి తెలిపారు. మండల స్థాయిలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం అవసరాన్ని బట్టి రైతు వేదికలను ఉపయోగించుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. ఇందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతి ఇచ్చారని ఒక ప్రకటనలో చిన్నారెడ్డి పేర్కొన్నారు.